Kazipet: కాజీపేటలో రైల్వే ప్లాంట్.. ఆధునిక సాంకేతికతతో మాన్యుఫ్యాక్చరింగ్ విభాగం
కాజీపేటలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు జరుగుతోందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఒకే విధమైన వస్తువుల తయారీలో నిమగ్నమయ్యే పాత పద్ధతులను విడిచిపెట్టి, అన్ని రకాల ఉత్పత్తులనూ ఒకే యూనిట్‌లో తయారుచేయగల విధానానికి మార్పు చేస్తున్నామన్నారు. కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు సాధ్యం కాదని మంత్రి రాజ్యసభలో తెలిపారు. అయితే అమృత్‌భారత్ స్టేషన్ పథకం కింద కాజీపేట రైల్వే స్టేషన్‌ను పునర్నిర్మిస్తున్నామని, దీంతోపాటు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,336 కోట్లు కేటాయించామన్నారు. కాజీపేట, నష్కల్, హసన్‌పర్తి ప్రాంతాల్లో ప్రతిపాదిత బైపాస్ లైన్లపై ఎంపీ కడియం కావ్య పలు సమస్యలను ఉంచారు.
రైల్వే లైన్‌ల కోసం మాస్టర్‌ప్లాన్
బైపాస్ లైన్ వల్ల విలువైన భూములు, నివాస ప్రాంతాలపై ప్రభావం ఉంటుందన్నారు. దీనిపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రైల్వే లైన్‌ల కోసం మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నామని, సభ్యురాలు సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలోని ఇనుప ఖనిజాలను రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థకు కేటాయించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల వంటి జిల్లాల్లో ఇనుపఖనిజాలు ఉండే ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గనుల అభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం బొగ్గు గనుల్లో అత్యధిక ప్రమాదాలు నమోదైన రాష్ట్రంగా కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్లలో దేశంలోని 11 రాష్ట్రాల్లో 794 ప్రమాదాలు చోటుచేసుకోగా, వాటిలో 65.11% తెలంగాణలోనే జరిగినట్లు వెల్లడించారు.