
Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, అంతర్గత కర్ణాటక,కేరళ ప్రాంతాలపై ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా వివరించింది.
హైదరాబాద్ మహానగరంలో ఈ నాలుగు రోజులు మబ్బులు కమ్మిన వాతావరణం కొనసాగుతుందని, మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
ఉత్తర తెలంగాణ జిల్లాలను తప్పితే మిగతా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వివరాలు
ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ
వర్షపాతం,వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాలకు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.
ఈ జాబితాలో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి.
ఈ జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వివరాలు
రుద్రంగి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం
బుధవారం రోజున రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి ప్రాంతంలో నమోదయ్యింది.
అక్కడ 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. మరోవైపు, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర వేడి పరిస్థితులు కొనసాగుతున్నట్టు తెలిపింది.
బుధవారం రోజున జగిత్యాల, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది.
అలాగే వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.