Year Ender 2024: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన జల విలయం ఇదే..
ఈ ఏడాది ప్రకృతి విపత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా, వారాలపాటు కురిసిన భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర కష్టాలు తెచ్చాయి. ఈ వర్షాల కారణంగా భారీ వరదలు ఏర్పడాయి, వీటి వల్ల అపార నష్టం జరిగింది. రికార్డు స్థాయిలో వరదలు ముంచెత్తి ఆస్తి, పంట నష్టాలు కలిగించడంతో పాటు, అనేక కుటుంబాల్లో ప్రాణనష్టం, విషాదాన్ని తెచ్చాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, నదులు, ఏరులు వరద నీటితో పొటెత్తడంతో ప్రజలు నీటిలో మునిగిపోయారు. పలు కాలనీలు, ఇళ్లు నీటితో ముంచబడడంతో, వేల మంది నిరాశ్రయులైయ్యారు. ఇళ్లలోకి నీరు చేరిన స్థితిలో ప్రజలు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందారు.
బుడమేరు నదికి సుమారు 60 వేల క్యూసెక్కుల వరద నీరు
ఆగస్టు 31, 2024న రాత్రి నుంచి రెండు వారాలపాటు కురిసిన వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ నగరాల్లో వరద నీరు రికార్డు స్థాయిలో ముంచెత్తింది. బుడమేరు నదికి సుమారు 60 వేల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో విజయవాడ నగరంలో పలు కాలనీలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలో నీరు మెుదటి అంతస్తు వరకు చేరింది. స్థానిక కాలనీల్లో జనాలు అత్యవసరంగా రెండో అంతస్తుకు చేరుకున్నారు.
చంద్రబాబు పర్యటన..
రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు బాధితుల సంక్షేమం కోసం సత్వర చర్యలు తీసుకున్నారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆయన విజయవాడ కలెక్టరేట్‌ను కేంద్రంగా మార్చి పక్కా చర్యలు తీసుకున్నారు. సహాయ చర్యలలో అలసత్వం చూపిన అధికారులను ఆయన మందలించారు. వరద ప్రభావిత ప్రజలకు ఆర్థిక సహాయం ప్రకటించి, సంబంధిత జీతాలను వారి ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు చేపట్టారు. విద్యుత్, రహదారుల, వ్యవసాయ రంగంలో భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 6,44,536 మంది బాధితులుగా లెక్కలు వెల్లడించారు.193 రిలీఫ్ క్యాంపుల్లో 42,707 మందికి ఆశ్రయం అందించింది. 50 ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ టీమ్‌లు, 228 బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 14 రాష్ట్రాలకు ఆర్థిక సహాయం
తెలంగాణలోని ఖమ్మం, మున్నేరు ప్రాంతాల్లో కూడా భారీ వరదలు వచ్చి, ప్రజలను నిస్సాహాయంగా వదిలి వెళ్లాయి. ఖమ్మం జిల్లాలో 730 కోట్లు మేర నష్టం జరిగిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల 5438 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. భారీ వర్షాలు, వరదలు వల్ల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 14 రాష్ట్రాలకు రూ.5,858.6 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించింది. 14 రాష్ట్రాలకు నిధులు కేటాయించిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.8 కోట్లు మంజూరు చేసింది.