
Rains: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు.. అల్పపీడనం ప్రభావంతో నేడు,రేపు వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వర్షాల బారిన పడ్డాయి. మంగళవారం రాత్రి నుంచి నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, మేడ్చల్, శామీర్‌పేట్ పరిసరాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మోటకొండూర్, తుర్కపల్లి, బొమ్మలరామారం ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. భువనగిరి మండలంలోని నందనంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఫలితంగా సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిల్వవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
వివరాలు
మంజీరా నదికి పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం
వికారాబాద్ జిల్లా కూడా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోంది. దీంతో కోట్‌పల్లి ప్రాజెక్ట్ మోస్తరుగా అలుగు పారడంతో వరద ప్రవాహం ఎక్కువైంది. దాని కారణంగా సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ఇదే సమయంలో కామారెడ్డి జిల్లాలో కూడా దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూర్, పాల్వంచ, పిట్లం, నిజాంసాగర్, లింగంపేట ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద కల్వర్టు తెగిపోవడంతో రహదారి దెబ్బతిని ట్రాఫిక్ నిలిచిపోయింది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌల్తాబాద్ ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. మంజీరా నదికి పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
అత్యధిక వర్షపాతం నమోదు
మెదక్ జిల్లా టెక్మాల్‌లో అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని తరువాత కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో 18 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌లో 16.48 సెంటీమీటర్లు, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 14.93 సెంటీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వివరించింది.
వివరాలు
రానున్న రెండు రోజులు వర్షాలే
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో వర్షాలు మరింత విస్తారంగా కురిసే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ మబ్బులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని, కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.