Weather Updates: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ కాగా, తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది 12 కిమీ వేగంతో వాయువ్య దిశగా కదులుతుంది. వాయుగుండం చెన్నైకి 360 కిమీ, పుదుచ్చేరికి 390 కిమీ, నెల్లూరుకు 450 కిమీ దూరంలో ఉన్నది. ఈ వాయుగుండం గురువారం (అక్టోబర్ 17) తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి- నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు
ఈ ప్రభావంతో ఏపీలో విస్తృతంగా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తా,రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు ఏపీకి చెందిన కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
తెలంగాణలో, ఇవాళ (అక్టోబర్ 16) సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, వికరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు (అక్టోబర్ 17) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.
హైదరాబాద్ లో, తేలిక నుండి మోస్తారు వర్షం
హైదరాబాద్ లో, తేలికపాటి నుండి మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య దిశగా ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. అక్టోబర్ 19వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.