
Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతుండగా, ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర దిశగా కదలే అవకాశముంది. ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. తరువాత 24 గంటల పాటు వాయుగుండం తీవ్రత కొనసాగనుందని అంచనా. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు, వర్షాలతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీరం మీద గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది.
వివరాలు
విశాఖలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం
అల్పపీడనం ప్రభావం తలెత్తడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురువారం రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరములో వర్షాలు పడుతున్నాయి. విశాఖలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ పరిస్థితి కారణంగా గోపాలపట్నం ఇందిరానగర్‌లో ఒక ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో, అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై జీవీఎంసీ అధికారులు యుద్ధప్రాతిపదికన తొలగింపు పనులు చేపట్టారు.