Page Loader
Telangana: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు.. 25 జిల్లాల్లో పంటల సాగు మందగింపు
తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు.. 25 జిల్లాల్లో పంటల సాగు మందగింపు

Telangana: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు.. 25 జిల్లాల్లో పంటల సాగు మందగింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతానికి 28 శాతం తక్కువగా వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సాధారణంగా 243.2 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సిన ఈ కాలంలో కేవలం 176 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వానాకాలంలో మొత్తం 1,32,44,305 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా, జూలై 16వ తేదీ వరకు 66,41,809 ఎకరాల్లో పంటలు వేసి ఉండాలి. కానీ ఇప్పటి వరకు 61,10,170 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేశారు. ముఖ్యంగా వరి సాగు విషయంలో పరిస్థితి మరింత మందగించిందని అధికారులు తెలిపారు.

వివరాలు 

 7,78,284 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు 

సాధారణంగా 62,47,868 ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 7,78,284 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేయగలిగారు. జూలై 16వ తేదీ వరకు సాధారణంగా 7.94 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా, ఈ ఏడాది దానికన్నా తక్కువగా సాగు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. పత్తి సాగు విషయంలో కూడా పంటలు తగ్గినట్లు తెలిపారు. సాధారణంగా 48,93,016 ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 38,56,884 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. మొక్కజొన్న పంట 86.32 శాతం, సోయాబీన్ 78.62 శాతం వరకూ సాగు కాగా, జొన్న పంట 55.20 శాతం, కందులు 51.34 శాతం మేర సాగు అయినట్లు అధికారులు వివరించారు.

వివరాలు 

సగానికి మించిన జిల్లాలు కేవలం 8 మాత్రమే

వానాకాలం సీజన్‌ ప్రారంభమైన 46 రోజులు గడిచినప్పటికీ 22 జిల్లాల్లో 50 శాతం కన్నా తక్కువగా మాత్రమే పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ నివేదిక పేర్కొంది. కరీంనగర్, జగిత్యాల, మెదక్, ములుగు, వనపర్తి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో 25 శాతం కన్నా తక్కువ పంటలు మాత్రమే సాగు చేశారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రం 76 శాతం వరకు పంటలు వేసినట్లు తెలిపింది. మరో 8 జిల్లాల్లో 60 శాతం వరకు మాత్రమే సాగు కొనసాగుతోందని వివరించారు.