Page Loader
Telangana: రాష్ట్రంలో మొదలైన వానాకాలం సీజన్‌.. నారు పోస్తూ.. దుక్కులు దున్నుతూ పొలాల్లో రైతులు
దుక్కులు దున్నుతూ పొలాల్లో రైతులు

Telangana: రాష్ట్రంలో మొదలైన వానాకాలం సీజన్‌.. నారు పోస్తూ.. దుక్కులు దున్నుతూ పొలాల్లో రైతులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికన్నా ముందే ప్రవేశించటంతో వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. ప్రతి రోజూ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ముందస్తుగా వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది వరి నారును పెంచడం ప్రారంభించగా, మరికొందరు ఇతర పంటల కోసం భూములను దున్ని విత్తనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈసారి 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా నిర్దేశించబడింది. గత సంవత్సరం వానాకాలంలో 1.29 కోట్ల ఎకరాల్లో సాగు జరిగింది. దీంతో ఈసారి అదనంగా 5 లక్షల ఎకరాల సాగు పెంపు లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివరాలు 

40 లక్షల ఎకరాల్లో సన్న పంటల సాగు జరిగే అవకాశం 

సాధారణంగా జూన్ నెలలో రైతులు పొలాలను దున్నడం ప్రారంభిస్తారు. కానీ ఈసారి మార్చి నుంచే వర్షాలు పడటం ప్రారంభమవటంతో సాగు పనులు ముందే ప్రారంభమయ్యాయి. గత పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగుపై దృష్టి పెట్టారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం,ఉత్పత్తి స్థాయిలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ దిశగా విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ సమాయత్తమవుతోంది. ముఖ్యంగా సన్న ధాన్యాలపై ప్రోత్సాహక బోనస్‌ నేపథ్యంలో ఈ సీజన్‌లో 40 లక్షల ఎకరాల్లో సన్న పంటల సాగు జరిగే అవకాశముందని అంచనా. ఇందుకోసం 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాల అవసరం ఉంది.

వివరాలు 

1.08కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు

వ్యవసాయశాఖ 60.11లక్షల ఎకరాల కోసం సన్న రకాల విత్తనాలు, 38.21 లక్షల ఎకరాల కోసం దొడ్డు రకాల విత్తనాలను కలిపి మొత్తం 98.32లక్షల ఎకరాలకు సరిపడే విత్తనాలను సిద్ధం చేసింది. అలాగే పత్తి పంట కోసం 1.08కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా విత్తనాల పంపిణీ కోసం వచ్చే నెల 2వ తేదీన గ్రామాల్లో ముగ్గురు ఆదర్శ రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన విత్తనాలను పంపిణీ చేయనున్నారు. 3వ తేదీ నుంచి ఇతర రైతులకు సాగు విత్తనాల పంపిణీ చేపట్టనున్నారు.ఇదే సమయంలో వానాకాలం సాగు కోసం రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

వివరాలు 

పంటల బీమా పథకం అమలు: 

ఇందులో ఏప్రిల్, మే నెలల్లో 1.72 లక్షల టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి అందాయి. మిగిలిన యూరియాను వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ వానాకాలం సీజన్‌లో ప్రధాని ఫసల్‌ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఇందులో రైతులు చెల్లించే బీమా ప్రీమియంలో సగభాగాన్ని కేంద్రం, మిగిలిన సగం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి. ఈ పథకాన్ని రాష్ట్రంలోని మొత్తం సాగు భూముల్లో 98 శాతం వర్తించేటట్లు చర్యలు తీసుకుంటున్నారు.

వివరాలు 

నకిలీ విత్తనాల నివారణపై చర్యలు: 

రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, ఎరువుల అమ్మకాల నియంత్రణకు పోలీసు శాఖ, వ్యవసాయశాఖ సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు చేసి నకిలీ విత్తనాల ముఠాలను పట్టుకున్నాయి. నకిలీ ఎరువుల నియంత్రణ కోసం గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ నెల 5వ తేదీ నుంచి "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.