సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. నేను వదిలిపెట్టాలనుకున్నా కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదు
ముఖ్యమంత్రి పీఠంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం పోస్టును వదులుకోవాలని అనుకుంటున్నానని, అదే తనను విడిచిపెట్టట్లేదన్నారు. ఈ మేరకు పార్టీలోని తన ప్రధాన ప్రత్యర్థి సచిన్ పైలట్‌ని ఉద్దేశించి గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి కూడా తానే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ఒక మహిళా మద్దతుదారు తనతో చెప్పిన విషయాన్ని గురువారం దిల్లీలో అశోక్ గెహ్లాట్ ప్రస్తావించారు. అందుకు తాను సీఎం పదవిని వదిలేయాలని అనుకుంటున్నానని, కానీ అదే తనను వదిలిపెట్టట్లేదని బదులిచ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే మూడు సార్లు అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, మరోసారి బాధ్యతలు చేపడితే మొత్తం నాలుగుసార్లు అవుతుంది.
అందుకే హైకమాండ్ తననే సీఎంగా మూడుసార్లు ఎంపిక చేసింది : అశోక్ గెహ్లాట్
గతంలో సీఎం గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం పైలట్ మధ్య క్యాంపు రాజకీయాల నేపథ్యంలో విభేదాలు తలెత్తాయి. 2020లో గెహ్లాట్ సర్కారుకు వ్యతిరేకంగా పైలట్ తన వర్గంతో కలిసి తిరుగుబాటు చేసిన క్రమంలో దాదాపుగా ప్రభుత్వం కుప్పకూలింది. అయితే గెహ్లాట్ లో ఏదో విశేషం ఉందని, అందుకే హైకమాండ్ తననే సీఎంగా మూడుసార్లు ఎంపిక చేసిందన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయం ఏదైనా ఆమోదయోగ్యంగానే ఉంటుందన్నారు. కాంగ్రెస్ జాబితా విడుదలలో జాప్యం జరిగిందన్న ప్రశ్నపై స్పందించిన గెహ్లాట్, దీనిపై బీజేపీ చింతిస్తోందన్నారు. తాము పోట్లాడటం లేదని వాపోతున్నారని పంచులేశారు. పైలట్ వర్గంతో మాట్లాడి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీతో అధికారంలోకి ఎవరు వస్తారోనన్న ఆసక్తి పెరిగింది.