Page Loader
Paksitan Spy: పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం.. రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు 
పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం.. రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు

Paksitan Spy: పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం.. రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా గూఢచర్య కార్యకలాపాలపై తీవ్ర దృష్టిసారించింది. ఇప్పటికే పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేస్తున్నారన్న ఆరోపణలతో నిఘా, దర్యాప్తు సంస్థలు పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజా ఘటనలో, పాకిస్తాన్ ఐఎస్ఐకి సమాచారం అందిస్తున్నారన్న అనుమానంతో రాజస్థాన్‌లోని ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని బుధవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

రాష్ట్ర ఉద్యోగి అరెస్ట్ - పూర్తి వివరాలు 

రాజస్థాన్ ఉపాధి విభాగంలో పని చేస్తున్న సకుర్ ఖాన్ మంగళియార్‌ను, జైసల్మేర్‌లోని అతని కార్యాలయం నుంచి రాష్ట్ర సీఐడీ, నిఘా శాఖల సంయుక్త బృందం అదుపులోకి తీసుకుంది. మంగళియార్‌ను తదుపరి విచారణ కోసం జైపూర్‌కు తరలించనున్నారు. మంగళియార్‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేతతో సంబంధాలున్నాయన్న అనుమానాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సంబంధాలపై భద్రతా శాఖలు ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంగళియార్, ఆ పార్టీకి చెందిన నేతకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలు 

నిఘాలో బయటపడిన షాకింగ్ విషయాలు 

మంగళియార్ రాజస్థాన్‌లోని బరోడా గ్రామంలోని మంగళియా ధనికి చెందినవాడు. అతని కార్యకలాపాలపై నిఘా సంస్థలు అనేక వారాలుగా గమనిస్తున్నాయి. అనుమానాస్పద ప్రవర్తనపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే విచారణ ప్రారంభమైందని జైసల్మేర్ ఎస్పీ సుధీర్ చౌదరి తెలిపారు. దర్యాప్తులో భాగంగా మంగళియార్ ఫోన్‌ పరిశీలనలో పాకిస్తాన్లోని అనేక ఫోన్ నంబర్లు కనిపించాయి.

వివరాలు 

7సార్లు పాకిస్తాన్‌కు పర్యటనలు  

ఇటీవలి సంవత్సరాల్లో కనీసం ఏడుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లినట్లు మంగళియార్ స్వయంగా అంగీకరించాడు. ఈ విషయం భద్రతా విభాగాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంకా, అతని ఫోన్‌ లో సైనిక సంబంధిత ఫోటోలు లేదా వీడియోలు ఏవీ కనిపించనప్పటికీ, అతడు అనేక ఫైళ్లు తొలగించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అలాగే, అతని పేరుమీద ఉన్న రెండు బ్యాంకు ఖాతాలపై కూడా అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. మంగళియార్‌కు పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని ఓ అధికారితో సంబంధాలున్నాయన్న విషయం కూడా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయే వరకు అధికార వర్గాలు మరిన్ని వివరాలను వెల్లడించడానికి వెనుకాడుతున్నాయి.