Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహిస్తోంది. కరణ్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్మీత్‌సింగ్ కున్నార్ మరణంతో ఆ స్థానంలో పోలింగ్‌ను ఈసీ వాయిదా వేసింది. రాజస్థాన్‌లో ఓటర్ల సంఖ్య 5,25,38,105 ఓటర్లు ఉండగా.. వివిధ పార్టీల నుంచి 1862 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో 107 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 70 మంది, ఆర్‌ఎల్‌పీ నుంచి ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరితో మిగతా వారు బీటీపీ, రాష్ట్రీయ లోక్‌దళ్, స్వతంత్రులు ఉన్నారు.
రాష్ట్రంలో 51,507 పోలింగ్ కేంద్రాలు
పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 36,101చోట్ల మొత్తం 51,507పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 10,501, గ్రామీణ ప్రాంతాల్లో 41,006పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 26,393పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాలను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. 70వేల మందికి పైగా రాజస్థాన్ పోలీసులు, 18వేల మంది హోంగార్డులు, 2వేల మంది రాజస్థాన్ బోర్డర్ హోంగార్డులు, ఇతర రాష్ట్రాల పోలీసులతో సహా 1,70,000మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
ఈసారి ఆ సంప్రదాయం కొనసాగుతుందా?
రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 1993లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ ఉంది. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ సారి ఆ ఆనవాయితీ ప్రకారం తాము అధికారంలోకి వస్తుందని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఈ సారి బ్రేక్ అవుతుందని, తిరిగి తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెబుతోంది. రాష్ట్రంలోని బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా. కాంగ్రెస్ రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD)తో పొత్తు పెట్టుకుంది.