
Adilabad Airport : రాజ్‌నాథ్ సింగ్ కీలక నిర్ణయం.. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ముందుకు!
ఈ వార్తాకథనం ఏంటి
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ విమానాశ్రయ స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా లేఖలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రక్షణశాఖ ఆధీనంలో ఉన్న ఆదిలాబాద్ వైమానిక విమానాశ్రయంలో త్వరలో పౌర విమానాలు ల్యాండయ్యే అవకాశం ఉంది.
అంతేకాకుండా వాయుసేన శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కూడా రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ఈ మేరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గత జనవరిలో (2025 జనవరి 29న) రక్షణ మంత్రికి లేఖ రాశారు. ప్రజావసరాల కోసం విమానాశ్రయ భూమిని వినియోగించాలని కోరారు.
ఆ లేఖపై స్పందించిన రాజ్‌నాథ్ సింగ్.. ఏప్రిల్ 4, 2025న సానుకూల లేఖను పంపారు.
Details
హర్షం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
దీంతో ఒక దీర్ఘకాలిక డిమాండ్‌కు ఊపిరి లభించినట్లైంది. ఈ సానుకూల ప్రకటనపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.
కిషన్ రెడ్డి ప్రకారం, ఆదిలాబాద్ జిల్లాలో పత్తి వ్యాపారం, వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఎంతో అవసరం.
ఈ నేపధ్యంలో 2022 జూలై 7, 2023 ఫిబ్రవరి 15న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాశారు.
2021 అక్టోబర్ 6న నాటి పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా రాష్ట్రానికి లేఖ రాసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని కిషన్ రెడ్డి విమర్శించారు.
Details
వరంగల్ విమానాశ్రయానికి అనుమతులు
ఇదిలా ఉండగా, తాజాగా వరంగల్ విమానాశ్రయానికి అనుమతులు లభించాయి.
దీనికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తిచేస్తే మౌలిక సదుపాయాల నిర్మాణం వేగవంతం చేయవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
దీంతో వరంగల్ ప్రజల కలలు సాకారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. గత నెలలో ఈ విషయంపై రామ్మోహన్ నాయుడుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించినట్లు గుర్తు చేశారు.
ఈ పరిణామాలతో పౌరవిమానయాన విస్తరణకు తెలంగాణ రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలకు మేలైన అవకాశం లభించనుంది.