
Telangana: తెలంగాణ టూరిజం స్పాట్ గా రామగిరి.. పర్వతమాల ప్రాజెక్ట్ కింద ఖిల్లాకు రోప్ వే ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఉన్న ప్రసిద్ధ రామగిరి ఖిల్లాకు రోప్ వే ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యంతో పాటు అపూర్వ శిల్ప కళలకు నిలయమైన ఈ ఖిల్లా, రోప్ వే ఏర్పాటు వల్ల ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా ఎదగగలదు.
గత 11వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీను కలిశారు.
ఈ సందర్భంగా పర్వతమాల ప్రాజెక్ట్ కింద రామగిరి ఖిల్లాకు రోప్ వే నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
వివరాలు
పర్యాటక ప్రదేశంగా రామగిరి అభివృద్ధి అవకాశాలు
ఇప్పటికే రామగిరి ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తానే స్వయంగా ముందడుగు వేశారు.
ఆయన చొరవతో ఖిల్లా పరిసర ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు కేటాయించారు.
రామగిరి సమీపంలో ఇప్పటికే స్టేట్,నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతోంది.ముత్తారం మీదుగా వరంగల్‌కు వెళ్లే ఎన్‌హెచ్ 63 నిర్మాణం కొనసాగుతోంది.
మరోవైపు, పెద్దపల్లి నుంచి కునారం వ్యవసాయ కేంద్రం మీదుగా ముత్తారం నుండి భూపాలపల్లి దిశగా మరో రాష్ట్ర రహదారి నిర్మించబడనుంది.
వివరాలు
ఎంపీ వంశీకృష్ణ చొరవతో అభివృద్ధి పనులకు వేగం
పీఎం సడక్ యోజన కింద అమ్రాబాద్ నుంచి ముత్తారం మండలంలోని పారుపల్లి వవర వరకు రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది.
ఇందులో ముత్తారం మండలంలో రూ.2.5 కోట్లు విలువైన రెండు వంతెనలు నిర్మించనున్నారు.
పార్లమెంటులో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు.
రోడ్లు, వంతెనల నిర్మాణం త్వరగా పూర్తవ్వాలని, ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ రహదారులు అన్నీ రామగిరి ఖిల్లా సమీపంలో ఉన్నాయి. అందువల్ల, రోడ్లతో పాటు రోప్ వే ఏర్పాటు కూడా పర్వతమాల ప్రాజెక్టు కింద చేపట్టాలని కేంద్ర మంత్రి గడ్కరిని కలిసి ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.
అధికారులు ఇప్పటికే ఖిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు.
వివరాలు
రవాణా, టూరిజం రంగాల్లో విస్తృతంగా వృద్ధి
ఖిల్లా చరిత్ర, శిల్పకళ, ప్రకృతి వైభవం వంటి అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలు అమలయ్యే పక్షంలో, రామగిరి మాత్రమే కాకుండా మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాలు కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.
ఇది జిల్లాలో రవాణా, టూరిజం రంగాల్లో విస్తృతంగా వృద్ధికి దారి తీస్తుంది.
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేగంపేట, రత్నాపూర్, కల్వచర్ల గ్రామాల మధ్య ఈ ఖిల్లా విస్తరించి ఉంది.
ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు, ఆయుర్వేద వైద్యులు, బొటనీ శాస్త్రజ్ఞులు ఇక్కడ బొటానికల్ టూర్ కోసం వస్తుంటారు.
వివరాలు
రోడ్డు సౌకర్యాల అవసరం
ప్రస్తుతం రామగిరి ఖిల్లాకు సరైన రహదారి సౌకర్యం లేదు. ఖిల్లాకు చేరేందుకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల పర్యాటకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బేగంపేట నుంచి ఖిల్లా వరకు రహదారి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించడానికి అధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.