Ramagundam: రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు.. రూ.29,344 కోట్లతో అంగీకారం
ప్రభుత్వ రంగ విద్యుత్తు దిగ్గజ సంస్థ ఎన్‌టీపీసీ, దేశవ్యాప్తంగా రూ.80,000 కోట్లతో 6,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి తమ బోర్డు ఆమోదం తెలిపినట్లు మంగళవారం ప్రకటించింది. ఇందులో తెలంగాణలోని రామగుండంలో ఉన్న సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ (3x800=2400 మెగావాట్ల) నిర్మాణం కోసం రూ.29,344.85 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా 76,443 మెగావాట్ల విద్యుదుత్పత్తి
ఇక మధ్యప్రదేశ్‌లో గదర్వర సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ (2x800 మెగావాట్ల) రూ.20,445.69 కోట్లతో నిర్మించనున్నారు. అదే విధంగా బిహార్‌లో నబినగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ (3x800 మెగావాట్ల)ను రూ.29,947.91 కోట్లతో నిర్మించేందుకు ఎన్‌టీపీసీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్‌టీపీసీ సంస్థ దేశం మొత్తం 76,443 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుంది.