బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం
ఈ వార్తాకథనం ఏంటి
2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయస్థాయిలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీటెక్కుతున్నాయి.
తాజాగా కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.
హర్యానాలోని కైతాల్‌లో జరిగిన కాంగ్రెస్ 'జన్ ఆక్రోష్ ర్యాలీ'లో ఆయన బీజేపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
రాష్ట్రంలో బీజేపీ, దాని మిత్రపక్షం జేజేపీలకు ఓటు వేసిన వారందరూ రాక్షస స్వభావం కలవారుగా అభివర్ణించారు.
సుర్జేవాలా చేసిన ఈ ప్రకటనపై బీజేపీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా సుర్జేవాలా వ్యాఖ్యలను ఖండించారు.
బీజేపీ
కోట్లాది మంది ఓటర్లను అవమానించడమే: బీజేపీ
సుర్జేవాలా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు ఓటు వేసిన కోట్లాది మంది ఓటర్లను అవమానించడమేనని బీజేపీ పేర్కొంది.
రాక్షస కుటుంబంలో పుట్టిన వ్యక్తికే ఇలాంటి ఆలోచనలు వస్తాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ అన్నారు.
దేశ, రాష్ట్రాల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏర్పాటు కోసం ఓట్లు వేస్తున్న వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే అన్నారు. సుర్జేవాలా అన్‌పార్లమెంటరీ భాషను ఓటర్లు మర్చిపోరని చెప్పారు.
దేశంలోని కోట్లాది మంది ఓటర్లను రాక్షసులుగా పిలవడం సూర్జేవాలా మనస్తత్వాన్ని తెలియజేస్తోందని హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా అన్నారు.
దేశంలోని ఓటర్లను రాక్షసులుగా పేర్కొంటూ రణదీప్ సూర్జేవాలా ఓటర్లందరినీ, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని హర్యానా అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ జ్ఞాన్‌చంద్ గుప్తా అన్నారు.