CM Chandrababu: రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి నాంది.. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. నూతన పాలసీల ద్వారా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు లభించేలా చర్యలు తీసుకోవాలని ఈ సమీక్షలో సీఎం సూచించారు. మూడు నెలలుగా అధికారులు సమగ్ర కసరత్తు చేసి కొత్త పాలసీలను రూపొందించారు. ముఖ్యమంత్రి సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఉత్తమ ఫలితాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా ఈ డ్రాఫ్ట్ పాలసీలను తయారు చేశారు. కొత్త పాలసీ అమలైన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి అదనపు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు అందించడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెంటివ్
పారిశ్రామిక వేత్తలకు ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా ఉండాలని, ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించే విధానంపై ఆలోచనలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేకంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్థాపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ హబ్ స్కిల్స్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా పనిచేయనుంది. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించారు . ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పట్ల కూడా ఈ సమావేశంలో చర్చించారు. తద్వారా కసరత్తు తరువాత క్యాబినెట్ ముందుకు ప్రత్యేక పాలసీ తీసుకురానున్నారు. ఈ సమీక్షలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.