New Ration cards: జనవరి 26న రేషన్ పండగ.. 6.68 లక్షల కుటుంబాలకు లబ్ధి
ఈ వార్తాకథనం ఏంటి
పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
పౌరసరఫరాలశాఖ ప్రాథమికంగా 6.68 లక్షల కుటుంబాలను కొత్త కార్డులకు అర్హులుగా గుర్తించింది. ఈ జాబితాను అన్ని 33 జిల్లాలకు పంపింది.
ఈ నెల 20 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, బస్తీ సభలు నిర్వహించి, అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను ఖరారు చేస్తారు.
జిల్లా కలెక్టర్ల ద్వారా తుది జాబితా వస్తే, పౌరసరఫరాలశాఖ జనవరి 26న కార్డుల జారీ ప్రారంభించనుంది.
ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కు గ్యాస్ సిలిండర్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల కోసం రేషన్ కార్డు అనేది ఆధారంగా ఉంది.
Details
వివరాలను సేకరించిన పౌరసరఫరాల శాఖ
ఇదివరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి పరిశీలించేవారు.
అయితే ఈసారి ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరించింది. గత నవంబరులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా, రేషన్ కార్డులు లేనివారి వివరాలను పౌరసరఫరాలశాఖ సేకరించింది.
ఈ సర్వే ద్వారా కొత్త కార్డులు కావాలన్నవారి వివరాలు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లకు సంబంధించిన సమాచారాన్ని వడబోశారు.
ఈ ప్రక్రియలో 6,68,309 కుటుంబాలు కొత్త కార్డులకు అర్హులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ కుటుంబాల్లో మొత్తం 11,65,052 మంది లబ్ధిదారులుగా ఉన్నారు.
Details
హైదరాబాద్‌లో 83,285 కుటుంబాలకు లబ్ధి
గ్రామ, బస్తీ సభల అనంతరం జాబితాలో మార్పులొస్తాయి.
ప్రాథమిక జాబితా ప్రకారం అత్యధికంగా హైదరాబాద్‌లో 83,285 కుటుంబాలకు, అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 6,647 కుటుంబాలకు కార్డులు మంజూరవుతాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంతకాలతో కొత్త రేషన్ కార్డులను లేఖ రూపంలో అందిస్తారు.
పాత కార్డుదారులకు, కొత్త కార్డుదారులకు త్వరలోనే కొత్త డిజైన్‌లో రేషన్ కార్డులను జారీ చేస్తారని సమాచారం. డిజైన్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.