
Bengaluru Stampede: ఆర్సీబీ ర్యాలీ ట్రాజెడీ.. తొక్కిసలాటకు కారణం ఎవరో స్పష్టం చేసిన కమిషన్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాటపై న్యాయ విచారణ నివేదిక బయటపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా జ్యుడీషియల్ కమిషన్ ఈ ఘటనపై తన నివేదికను సీఎం సిద్ధరామయ్యకు సమర్పించింది. ఈ ప్రమాదానికి ఆర్సీబీ (RCB), కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA), ఈవెంట్ నిర్వహణ సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని కమిషన్ పేర్కొంది. క్రౌడ్ కంట్రోల్ సాధ్యపడదని తెలిసినా కార్యక్రమాన్ని రద్దు చేయకపోవడం, ప్రణాళిక లోపాలు, సమన్వయం లేకపోవడం, భద్రతా ఏర్పాట్లు సరైనవిగా లేకపోవడమే ఈ విషాదానికి కారణాలుగా నివేదిక స్పష్టం చేసింది.
Details
కమిషన్ కీలకంగా గుర్తించిన అంశాలు
స్టేడియం లోపల కేవలం 79 మంది పోలీసులు మాత్రమే విధుల్లో ఉండగా, స్టేడియం వెలుపల భద్రతా సిబ్బంది లేకపోవడం. అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్సులు కూడా అక్కడ లేకపోవడం. కీలక అధికారులు సంఘటనపై తక్షణ స్పందన చూపించకపోవడం. ముందస్తుగా ప్రజల తరలింపుపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం. ఇదంతా తేల్చేందుకు కమిషన్ సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఘటనాస్థలిని పరిశీలించడంతో పాటు, పోలీసు అధికారులు, కేఎస్‌సీఏ ప్రతినిధులు, ఇతర సంబంధిత అధికారుల వాంగ్మూలాలు నమోదు చేసింది.
Details
18ఏళ్ల నిరీక్షన తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టును సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించింది. మెజిస్టీరియల్ విచారణ అనంతరం న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే ఆర్సీబీ, కేఎస్‌సీఏ, డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఘటన తర్వాత బెంగళూరు పోలీస్ కమిషనర్ సహా ఐదుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కొంతమంది అరెస్టులో ఉన్నారు.