
Red Fort : ఎర్రకోటలో మరోసారి భద్రతా వైఫల్యం.. బాంబులతో నకిలీ ఉగ్రవాది సంచారం
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్వాతంత్ర్య దినోత్సవం 79వ వేడుకలకు కేవలం కొన్ని రోజులు ముందే, ఎర్రకోట వద్ద మూడోసారి భద్రతా లోపం బయటపడింది. నివేదికల ప్రకారం,దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్‌కు చెందిన ఒక 'నకిలీ ఉగ్రవాది' ఆగస్టు 8న (శుక్రవారం) ఎర్రకోటలోకి చొరబడ్డాడు. అతను పిల్లల ప్రదర్శన ప్రాంతం వరకు నకిలీ పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలిగాడని సమాచారం. ఆగస్టు 15 కార్యక్రమాల ముందు జరుగుతున్న రిహార్సల్ డ్రిల్ల్స్‌లో ఇది మూడోసారి జరిగిన భద్రతా వైఫల్యం.
వివరాలు
అసలేం జరిగింది?
హిందూస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఒక సీనియర్ పోలీస్ అధికారి చెప్పిన వివరాల ప్రకారం, ఆ నకిలీ ఉగ్రవాది నిషాద్ రాజ్ రోడ్ పెట్రోల్ బంక్ దగ్గర గోడ ఎక్కి ఎర్రకోటలోకి ప్రవేశించాడు. తర్వాత, అత్యంత భద్రత ఉన్న వీక్షకుల కూర్చొనే ప్రాంతంలో కొంతసేపు తిరుగుతూ, అక్కడే సెక్యూరిటీ సిబ్బందితో పాటు సెల్ఫీలు తీసుకుని, వీడియోలు కూడా రికార్డు చేశాడు. అనంతరం ఎవరూ ఆపకుండానే బయటకు వెళ్లిపోయాడు. ఈ 'మాక్ సెక్యూరిటీ బ్రీచ్' ఫోటోలు, వీడియోలు తర్వాత పోలీస్ హెడ్‌క్వార్టర్స్,ప్రధాని భద్రతా విభాగానికి నిబంధన ప్రకారం పంపించబడ్డాయి. అయితే, ఈ లోపానికి కారణమైన భద్రతా సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేదు.
వివరాలు
అదుపులోకి ఐదుగురు బంగ్లాదేశ్ పౌరులు
సెక్యూరిటీ డ్రిల్'లో మూడోసారి వైఫల్యం చోటుచేసుకుంది.ఇంతకుముందు,ఇలాంటి రిహార్సల్ డ్రిల్‌లో ఒక వ్యక్తి 'డమ్మీ బాంబ్'తో ఎర్రకోటలోకి చొరబడిన ఘటనలో ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అలాగే, ఇటీవల ఐదుగురు బంగ్లాదేశ్ పౌరులు కూడా ఎర్రకోటలోకి ప్రవేశించే ప్రయత్నంలో అదుపులోకి తీసుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం,ఇప్పటివరకు కనీసం 15 డ్రిల్ల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి.
వివరాలు
ఇవి సాధారణ రిహార్సల్స్ మాత్రమే
ఉత్తర ఢిల్లీ డీసీపీ రాజా బంతియా మాట్లాడుతూ, "ఇవి సాధారణ రిహార్సల్స్ మాత్రమే. లోపాలను నివారించడానికి మేము ఇలాంటివి తరచుగా నిర్వహిస్తాం. అనేక డ్రిల్ల్స్‌లో మా సిబ్బంది డమ్మీ ఉగ్రవాదులను పట్టుకున్నారు" అని తెలిపారు. మరొక అధికారి ప్రకారం, "మూడుసార్లు మాక్ సబ్వర్షన్ డ్రిల్ల్స్, రెండు డమ్మీ చొరబాటు డ్రిల్ల్స్ స్పెషల్ బ్రాంచ్ నిర్వహించగా, తొమ్మిది డమ్మీ ఇన్‌ఫిల్ట్రేషన్ ప్రయత్నాలను లోకల్ విజిలెన్స్ బ్రాంచ్ పట్టుకుంది. అలాగే స్పెషల్ సెల్ చేసిన ఒక మాక్ సబ్వర్షన్ డ్రిల్‌లో కూడా అనుమానితులు పట్టుబడ్డారు" అని వివరించారు.