chilli farmers: మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు క్షీణించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది శుక్రవారం కృషిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ సమస్యపై చర్చించారు.
ఈ సమావేశంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రత్యక్షంగా పాల్గొనగా, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
Details
మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ఈ సమావేశంలో ప్రధానంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ధర, సాగు ఖర్చు మధ్య ఉన్న తేడాను భర్తీ చేయాలి.
ఎంఐఎస్ కింద కొనుగోలు పరిమితిని 25శాతం నుంచి 75శాతానికి పెంచడం, మిర్చి సాగు వ్యయాన్ని ఐకార్ నిర్ణయించిన ప్రకారం కాకుండా, ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన రూ.11,600ను పరిగణనలోకి తీసుకోవడం, అలాగే ఎగుమతులపై ఉన్న అడ్డంకులను తొలగించడంపై వంటి అంశాలపై చర్చ జరిగింది.
ఈ డిమాండ్లపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Details
భరోసానిచ్చిన కేంద్రం
సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి కేంద్రం వెంటనే స్పందించిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఆయన మధ్యప్రదేశ్‌లో ఉన్న కారణంగా, చంద్రబాబును వ్యక్తిగతంగా కలవలేకపోయిన వ్యవసాయ మంత్రి శుక్రవారం దిల్లీకి రాగానే తొలి సమావేశాన్ని మిర్చి రైతుల సమస్యలపైనే ఏర్పాటు చేశారన్నారు.
పంట ఉత్పత్తి వ్యయానికి, కొనుగోలు ధరకు మధ్య ఉన్న తేడాను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని చెప్పారు.
మిర్చి సాగుకు ప్రభుత్వం ఖర్చు క్వింటాల్‌కు రూ.10,000 అని ఐకార్ నిర్ణయించినా, ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన రూ.11,600ను పరిగణనలోకి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశామన్నారు.
Details
మార్కెట్ రేటుకు భరోసా - రైతులకు లబ్ధి
ప్రస్తుతం మార్కెట్ ధర, సాగు ఖర్చు మధ్య తేడాను కేంద్రం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టంగా ప్రకటించారు.
కేంద్రం అందించే ప్రతి పైసా నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఈ సహాయాన్ని మరింత పెంచాలని కూడా అభ్యర్థించామని తెలిపారు.
ఈ నిర్ణయాలతో గుంటూరు, పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న మిర్చి రైతులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.