Delhi: మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సమరానికి తెరలేచింది.
నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పట్టుదలగా ఉండగా, 26 ఏళ్ల విరామం తర్వాత తిరిగి దిల్లీలో జెండాను ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ కసితో ఉంది.
ఈ రెండు పార్టీల మధ్య తుది విజయం ఎవరిని వరిస్తుందనేది కొద్ది గంటల్లో తేలనుంది.
ఉత్సాహభరితంగా ఎదురుచూస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు శనివారమే వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాల్లో 10 వేల మంది పోలీసులను మూడంచెల భద్రతా ఏర్పాట్లతో మోహరించారు.
Details
మెజార్టీకి 36 స్థానాలు అవసరం
ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. తాజా ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ మెరుగైన స్థితిలో ఉందన్న సంకేతాలు కనిపించాయి.
దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీగా 36 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 60.54% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. రెండు పార్టీలు తమ విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ శుక్రవారం మాట్లాడుతూ, తమ పార్టీ దాదాపు 50 సీట్లు గెలుచుకోగలదని ధీమా వ్యక్తం చేశారు.
Details
మరికొన్ని గంటల్లో ఫలితం
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అధిపత్యానికి తెరపడే సమయం ఆసన్నమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేస్తూ, తాము అధికారంలో కొనసాగడం ఖాయమని ఆప్ స్పష్టం చేసింది.
శుక్రవారం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ అభ్యర్థులతో భేటీ అయ్యారు. తమ పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం లాంఛనమని వ్యాఖ్యానించారు.
ఇక గత రెండు ఎన్నికల్లో దిల్లీలో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మెరుగైన ఫలితాలను సాధించాలని ప్రయత్నిస్తోంది.
ఒకప్పుడు వరుసగా 15 ఏళ్లపాటు దిల్లీని పాలించిన ఈ పార్టీ, మళ్లీ తన పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే దిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది కొద్ది గంటల్లో తేలనుంది.