
Telangana: నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. సోనియాతో భేటీ అయ్యే ఛాన్స్…
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా హస్తినకు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ ఢిల్లీ పర్యటనలో బీసీ రిజర్వేషన్లు, కులగణన అంశాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ సోనియా గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీతో సీఎం బృందం భేటీ కానుంది. కులగణనపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఈ నేతలకు సీఎం రేవంత్ అందజేయనున్నారు. అంతేకాదు, రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో 100 మంది కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
వివిధ అంశాల వారీగా సర్వే వివరాలు.. 300 పేజీల రిపోర్ట్
తెలంగాణలో ఇటీవల చేపట్టిన కులగణన,బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అవసరాన్ని ఢిల్లీ నేతలకు ముఖ్యమంత్రి బృందం వివరించనుంది. ఈ అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ ఎంపీలను రేవంత్‌రెడ్డి కోరనున్నారు. ఈ భేటీల అనంతరం కేంద్ర మంత్రులను కూడా సీఎం బృందం కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై నిపుణుల కమిటీ ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. వివిధ అంశాల వారీగా సర్వే వివరాలను సమగ్రంగా విశ్లేషించి 300 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రంలోని కులగణన విధానం దేశానికి ఒక ఆదర్శంగా నిలవగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
రేవంత్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత
అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబాటుతనానికి గల కారణాలను విశ్లేషించాలని నిపుణుల కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కులాల వారీగా వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసిన కమిటీ, ప్రస్తుత విధానాలను మెరుగుపరచడం సహా కొత్త పాలసీల రూపకల్పనకు అవసరమైన సూచనలను నివేదికలో చర్చించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నిర్వహించిన కులగణన కేవలం డేటా సేకరణ మాత్రమే కాకుండా, ఇది రాష్ట్రానికి మెగా హెల్త్ చెకప్‌గా పనిచేసిందని అభివర్ణించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఈ గణనను చేపట్టామని, బీసీల అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఇది ప్రధానమైన సాధనమని తెలిపారు. ఈ మొత్తం నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.