Telangana: తెలంగాణలో కొత్త విద్యా కమిషన్.. త్వరలోనే చైర్మన్, సభ్యుల నియామకం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మంగళవారం ఈ సంబంధిత అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానం రూపొందించడానికి ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో చైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులు ఉంటారు. చైర్మన్, సభ్యుల నియామకం త్వరలోనే పూర్తవుతుంది. వారు ఈ పదవుల్లో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు.
విద్యా రంగ బలోపేతంపై దృష్టి
విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం,దానిని బలోపేతం చేయడం లక్ష్యంగా కమిషన్ పనిచేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విద్యా రంగ బలోపేతంపై దృష్టి పెట్టామని, అందులో భాగంగానే ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యకు బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో కేటాయింపులు చేసినట్లు కూడా తెలిపారు. రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని, అందువల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.