Revanth Reddy: దిల్లీకి రేవంత్ రెడ్డి.. ఇవాళ మోదీ, అమిత్ షాతో భేటి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి పయనమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసి, ఆర్థిక సాయం కోరడానికి ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే అమిత్ షాతో భేటీకి అపాయింట్‌మెంట్ ఖరారు కాగా, ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదు. గురువారం మధ్యాహ్నం అమిత్ షాను, అలాగే సాయంత్రం లేదా రాత్రి ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలవనున్నారు.
పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం
వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టంపై నివేదిక సమర్పించి, తగిన ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. పీసీసీ చీఫ్‌గా నియమితులైన తర్వాత మహేశ్ తొలిసారిగా ఢిల్లీ వెళ్తున్నారని, ఎఐసీసీ నేతలను మర్యాదపూర్వకంగా కలవడమే ఆయన పర్యటన ఉద్దేశమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వేర్వేరు సందర్భాలలో దిల్లీకి వెళ్లినప్పటికీ ఇద్దరూ అక్కడ ఒకేసారి ఉండటం పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఇవాళ పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.