Telangana: రేషన్ కార్డు ఉన్న మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది మహిళలకు రామచిలుక రంగు (ప్యారెట్ గ్రీన్) చీరలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోటి మంది మహిళలకు లబ్ధి ఆహార భద్రత కార్డు లేదా రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలను ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.
వివరాలు
చేనేత కార్మికులకు ఉపాధి
వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో నివసించే 35 లక్షల మంది మహిళలు ఉన్నారు.
మొత్తం కోటి చీరల్లో 95 లక్షల చీరలు 6.30 మీటర్ల పొడవు కలిగిన పాలిస్టర్‌తో తయారు చేయగా, మరో 5 లక్షల చీరలను 9 మీటర్ల పొడవుతో పాలీ-కాటన్ వస్త్రంతో రూపొందించారు.
స్థానిక చేనేత రంగాన్ని ప్రోత్సహించడం, నేత కార్మికులకు ఉపాధి కల్పించడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి.
ఇందులో భాగంగా సిరిసిల్లతో పాటు ఇతర ప్రాంతాల్లోని నేత కార్మికులకు చీరల తయారీ బాధ్యతలను అప్పగించారు.
తద్వారా చేనేత రంగానికి ప్రోత్సాహం లభించడంతో పాటు కార్మికులకు చేతినిండా పని దొరకనుంది.
వివరాలు
మొబైల్ యాప్ ద్వారా పంపిణీ
చీరల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అర్హులైన మహిళలు తమ గ్రామాలు, వార్డుల్లో ఏర్పాటు చేసే పంపిణీ కేంద్రాలకు వెళ్లి రేషన్ కార్డు, ఆధార్ వివరాలు సమర్పించాలి.
అనంతరం వారికి చీరలను అందజేస్తారు. తొలుత ఈ కార్యక్రమాన్ని నవంబర్ 19న ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.
అయితే అనివార్య కారణాల వల్ల ప్రారంభ తేదీని నవంబర్ 26కు మార్చింది.
జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీ కొనసాగనుంది.