
Revanth Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్… టూర్ షెడ్యూల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనమవుతున్నారు. అటు అధికారిక సమావేశాలతో పాటు,ఇటు పార్టీ అధిష్ఠానంతో కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టుల విషయంలో కేంద్ర నేతలతో చర్చించేందుకు సిద్ధమైన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రగతిని కాంగ్రెస్ హైకమాండ్‌కి వివరించనున్నారు. ఇటీవల తెలంగాణను సందర్శించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం రేవంత్ ఢిల్లీకి వెళుతుండటంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది. సోమవారం ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి,రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారని సమాచారం. హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)తో పాటు, రీజనల్ రింగ్ రోడ్‌కి చెందిన ఉత్తర,దక్షిణ భాగాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నారు.
వివరాలు
ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో భారీ బహిరంగ సభ
ఈ కీలక ప్రాజెక్టులకు కేంద్ర మద్దతును పొందేందుకు ప్రత్యేక కృషి చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా,ఇతర ఎరువుల కొరత నేపథ్యంలో, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి వెంటనే ఎరువుల కోటా విడుదల చేయాలని సీఎం వినతిపెట్టనున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించాలనే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారని సమాచారం.
వివరాలు
శాసనసభ నియోజకవర్గాల్లో 'ఇందిరా మహిళా శక్తి సంబరాలు'
అంతేగాక, పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ, అలాగే కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా అధిష్ఠానంతో సీఎం చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో 'ఇందిరా మహిళా శక్తి సంబరాలు' నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. ఈ కార్యక్రమంపై కూడా రేవంత్ కాంగ్రెస్ నాయకత్వానికి వివరించనున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు పలు రాజకీయ అంశాలపై కూడా పార్టీ నేతలతో ఆయన చర్చలు జరిపే అవకాశముంది.