LOADING...
Andhrapradesh: మళ్లీ ఏపీ ఆధీనంలోకి.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి వైపు భాగం
మళ్లీ ఏపీ ఆధీనంలోకి.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి వైపు భాగం

Andhrapradesh: మళ్లీ ఏపీ ఆధీనంలోకి.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి వైపు భాగం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి వైపున ఉన్న భూభాగాన్ని మళ్లీ తన అధీనంలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం,సాగర్‌ కుడి కాలువ నిర్వహణ బాధ్యతను ఇకపై ఏపీ ప్రభుత్వమే నిర్వహించనుంది. ఇదే దిశగా 2023 నవంబరులోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని తాత్కాలికంగా తన నియంత్రణలోకి తీసుకుంది. అయితే,కృష్ణా బోర్డు తరఫున కుడి కాలువకు నీటి విడుదలకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలు పూర్తిగా అమలవకుండా ఉండటంతో,నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనితో పాటు,రాజకీయ అంశాలూ కలగలిసి ఏపీ ఈ చర్యకు ముందడుగు వేసినట్టు భావిస్తున్నారు. ఆ తరవాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, అక్కడ మోహరించిన రాష్ట్ర పోలీసుల్ని ఉపసంహరించుకోవాలని సూచించింది.

వివరాలు 

26 గేట్లలో 13 గేట్లు ఏపీ భూభాగంలో

దాంతో పాటు అక్కడ కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్‌పీఎఫ్‌ను మోహరించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏర్పాటుచేసిన కృష్ణా, గోదావరి నదీ నిర్వహణ బోర్డులకు బాధ్యతలు అప్పగించాల్సిన అంశం ఇంకా పూర్తిగా అమలవలేదు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ అమలు ఇప్పటివరకు ముందుకు సాగలేదు. ప్రస్తుతం శ్రీశైలంలో ఎడమ వైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వంటి సదుపాయాలను తెలంగాణ నిర్వహిస్తోంది. అదే విధంగా నాగార్జునసాగర్‌ జలాశయానికి ఉన్న మొత్తం 26 గేట్లలో 13 గేట్లు ఏపీ భూభాగంలో ఉన్నాయి. ఈ దృష్ట్యా సాగర్‌ కుడి కాలువ పరిధిని మళ్లీ పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోవాలని ఏపీ ప్రయత్నిస్తోంది.

వివరాలు 

బోర్డుల ఆధీనంలోకి ప్రాజెక్టులు ఎప్పుడు వస్తాయి? 

ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నదీ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం సూచించినా, ఆ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌ ఇందుకు అంగీకరించినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రత్యేకించి బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పుల పట్ల తెలంగాణ వివిధ సందేహాలు, చర్చలు లేవనెత్తుతోంది. కృష్ణా నదీజలాల పునఃపంపకాన్ని కోరుతూ, తెలంగాణ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖను ఆశ్రయించింది.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టులో స్టే కోరుతూ పిటిషన్

దాంతో పాటు కేంద్రం బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌కు కొన్ని అదనపు మార్గదర్శకాలను జారీ చేయడమేగాక, వాటిని పరిగణనలోకి తీసుకొని తుదినిర్ణయం ఇవ్వాలని నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టులో స్టే కోరుతూ పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో, ట్రైబ్యునల్‌ తుది తీర్పు వచ్చిన తరువాత మాత్రమే ఉమ్మడి ప్రాజెక్టులను నదీ బోర్డుల ఆధీనంలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని తెలంగాణ స్పష్టం చేస్తోంది.