
Ritlal Yadav: బీహార్‌లో దోపిడీ కేసు,ఫోర్జరీ కేసు.. దానాపూర్ కోర్టులో లొంగిపోయిన ఆర్జేడీ ఎమ్మెల్యే
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే రిత్‌లాల్ యాదవ్ (Ritlal Yadav) దానాపూర్ కోర్టులో లొంగిపోయారు.
దానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనపై బలవంతపు వసూళ్లు, ఫోర్జరీ, హత్య బెదిరింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయనతో పాటు, ఆయనకు సమీపంగా ఉన్న చిక్కు యాదవ్, పింకూ యాదవ్, శ్రమణ్ యాదవ్‌లు కూడా కోర్టు ఎదుట లొంగిపోయారు.
ఒక బిల్డర్‌ను డబ్బు డిమాండ్ చేస్తూ హత్య చేస్తామని బెదిరించిన ఘటనపై వచ్చిన ఫిర్యాదుతో పాట్నా పోలీసులు రిత్‌లాల్‌తో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో భాగంగా ఏప్రిల్ 11న పాట్నా, దానాపూర్‌లోని నిందితుల సంబంధిత 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
వివరాలు
నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఈ దాడుల్లో రూ.10 లక్షలకుపైగా నగదు, రూ.77 లక్షల విలువైన చెక్కులు, ఆరు ఖాళీ చెక్కులు, ఆస్తుల కొనుగోలు, అమ్మకాలతో సంబంధిత 14 పత్రాలు, ఆరు పెన్‌డ్రైవ్‌లు, వాకీ చాకీ, 17 చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయమై జిల్లా ఎస్పీ అవ్‌కాష్ కుమార్ స్పందిస్తూ, బెదిరింపులు అందుతున్నట్లు ఒక బిల్డర్ తమకు ఫిర్యాదు చేశాడని తెలిపారు.
నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
ఈ నేపథ్యంలో రిత్‌లాల్ యాదవ్‌తోపాటు ఇతని అనుచరులు కోర్టులో లొంగిపోవడం ప్రాధాన్యత కలిగిన పరిణామంగా మారింది.