
Solar Power: అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలకు 'సౌర' విద్యుత్ వెలుగులు .. 496 కార్యాలయాలను గుర్తించిన ఎన్‌టీపీసీ
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలు త్వరలో సౌర విద్యుత్ ఆధారంగా నడిచే ఏర్పాటు చేసుకోబోతున్నాయి.
ఈ ప్రాజెక్టుల అమలుకు గాను రాష్ట్ర ప్రభుత్వం,ఎన్‌టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ (NVVN) సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం,ప్రభుత్వ కార్యాలయాల మీద రూఫ్‌టాప్ ప్రాజెక్టుల రూపంలో మొత్తం 300 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుల వల్ల ఒప్పంద కాలవ్యవధిలో దాదాపు రూ.2,957 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశముందని అంచనా వేయబడుతోంది.
సంస్థ చేసిన ప్రాథమిక సర్వే ప్రకారం,రాష్ట్రంలోని 496 ప్రభుత్వ కార్యాలయాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని గుర్తించింది.
వివరాలు
ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులు తగ్గించేలా..
తొలి దశలో వీటిలో సుమారు 147 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఎన్‌టీపీసీ యోచిస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాలలో సాధారణంగా విద్యుత్ యూనిట్‌కి రూ.6 నుండి రూ.8 వరకు వ్యయం అవుతోంది.
అయితే, సౌర విద్యుత్ వినియోగిస్తే, అదే యూనిట్ ఖర్చు సగానికి సగం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రాజెక్టు పెట్టుబడులు, నిర్వహణ ఖర్చులు, రూఫ్‌టాప్ వినియోగానికి ఎన్‌టీపీసీ చెల్లించాల్సిన లీజు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం విద్యుత్ యూనిట్‌కు చెల్లించాల్సిన ఖర్చును నిర్ణయించనుంది.
ప్రాథమికంగా యూనిట్ విద్యుత్ ధర రూ.4కి సమీపంగా ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు.
వివరాలు
రెస్కో విధానంలో ప్రాజెక్టుల అమలు
ఈ విధంగా,ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగ వ్యయం ఎంతో కొంత తగ్గనుండగా,ఎక్కువగా పగటి వేళలలో జరిగే వినియోగం కారణంగా సౌర విద్యుత్‌ను నేరుగా వినియోగించడం వల్ల థర్మల్ విద్యుత్‌ను ఇతర అత్యవసర అవసరాలకు మార్చివేసే అవకాశం ఏర్పడుతుంది.
దీని వల్ల పీక్ డిమాండ్ సమయంలో ఉత్పత్తిని సులభంగా సమన్వయం చేయవచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రూఫ్‌టాప్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను ఎన్‌టీపీసీ ఇప్పటికే ప్రభుత్వ కళాశాలలు, జూనియర్ కాలేజీలు,ఆసుపత్రులు,ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశీలించింది.
కనీసం 150కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి తగిన స్థలం లభిస్తే ప్రాజెక్టులు సాధ్యమవుతాయని సంస్థ వెల్లడించింది.
అయితే ప్రభుత్వం సమీక్ష తర్వాత కనీసం 50కిలోవాట్ల సామర్థ్యంగల ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉందని తెలిపింది.
వివరాలు
25 సంవత్సరాల నిర్వహణ బాధ్యత
ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను రెస్కో (Renewable Energy Service Company) విధానంలో నిర్మించనున్నారు.
దీని ప్రకారం ప్రాజెక్టుల ఏర్పాటుకు కావలసిన పెట్టుబడి, అలాగే 25 సంవత్సరాల నిర్వహణ బాధ్యతను కూడా అదే సంస్థ చేపడుతుంది.
ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి తొలి దశలో కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని, మిగిలినవి రెండో దశలో పూర్తి చేయాలని ఎన్‌టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది.