కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75నాణెం విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ, కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. నాణేనికి ఒక వైపు అశోక చక్రం, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. అలాగే దాని పక్కన దేవనాగరి లిపిలో "భారత్", కుడి వైపున ఆంగ్లంలో "భారత్" అనే పదం ఉంటుంది. నాణేనికి రెండో వైపు పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది. ఎగువ అంచున దేవనాగరి లిపిలో "సంసద్ సంకుల్", దిగువ అంచున ఆంగ్లంలో "పార్లమెంట్ కాంప్లెక్స్" అనే పదాలు ఉంటాయి.
నాలుగు లోహాల మిశ్రమాలతో నాణెం తయారు
నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. దాని అంచుల వెంట 200 సెరేషన్‌లను కలిగి ఉంటుంది. 35 గ్రాముల బరువుతో నాణేన్ని తయారు చేస్తారు. 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్ మిశ్రమాలతో నాణేన్ని తయారు చేస్తారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దాదాపు 25 పార్టీలు హాజరుకానుండగా, కనీసం 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులుగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.