అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియను చేపట్టింది. వర్షాకాలం ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతన్నలకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.10 వేలను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ మేరకు 2 విడతల్లో రైతులకు పంట సాయాన్ని అందిస్తామన్నారు. పథకం పదకొండో విడత నిధులు జమచేయనున్న నేపథ్యంలో ఈసారి దాదాపు 70 లక్షల మందికి రైతుబంధు అందనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
రూ.4 లక్షల మంది పోడు రైతులకూ రైతు బంధు పథకం వర్తింపు
ఈసారి అందించబోయే రైతుబంధులో భాగంగా పోడు రైతులకూ ఈ పథకం వర్తింపజేస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు సుమారు 4 లక్షల మంది పోడు రైతులను లబ్ధిదారులుగా గుర్తించనున్నారు. తెలంగాణలోని 1.54 కోట్ల ఎకరాల సాగు భూమికి సంబంధించి మొత్తం రూ.7720.29 కోట్ల నిధులు రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. అయితే కొత్తగా 5 లక్షల లబ్దిదారులు ఈ ఏడాది పెట్టుబడి సాయం అందుకోనున్నారు. ఈ పథకం పేరిట ఇప్పటివరకు జరిగిన 10 విడతల కేటాయింపుల్లో భాగంగా రూ.65, 190 కోట్లను రైతులకు బదిలీ చేశారు. ఎప్పటి మాదిరే తొలుత ఎకరం లోపు ఉన్న వారికి నిధులు జమచేసి, తర్వాత విస్తీర్ణం మేరకు మిగతా వారికీ అందించనున్నారు.