ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఆకస్మిక మరణం.. ఫామ్ హౌస్ లో గుండెపోటుతో కుప్పకూలిన కళాకారుడు
తెలంగాణ కళాకారుడు, బీఆర్ఎస్ నేత, గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. బుధవారం సాయంత్రం కుటుంబీకులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామంలోని తన ఫామ్ హౌస్‌కి వెళ్లారు. అర్ధరాత్రి సాయిచంద్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నాగర్ కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా తేల్చారు. ఈ క్రమంలో పరిస్థితి సీరియస్ గా మారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో సాయిచంద్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సమాచారం అందుకున్న వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు,ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆస్పత్రికి చేరుకున్నారు. సాయిచంద్ ఆకస్మిక మరణంపై సంతాపాన్ని తెలియజేశారు.
2021 డిసెంబర్‌లో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకం
మరోవైపు సాయిచంద్ మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నవయస్సులోనే హఠాత్తుగా మరణించడం తనను కలచివేసిందన్నారు. ఆయన మరణంతో రాష్ట్రం, గొప్ప గాయకుడిని, కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాయిచంద్ ఎన్నో పాటలు పాడి జనాల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారన్నారు. ఆయన మరణంపై సంతాపం ప్రకటించిన సీఎం, బాధిత కుటుంబీకులకు అండగా ఉంటామని తెలిపారు. 1984 సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలో సాయిచంద్ జన్మించారు. పీజీ చేసిన సాయి, విద్యార్థి దశ నుంచి గాయకుడిగా, కళాకారుడిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ప్రగతిని, సంక్షేమ పథకాలను పాటల ద్వారా వివరించారు. 2021 డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.