Medaram Jatara 2025: సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రారంభం.. లక్షలాదిమంది భక్తుల రాక
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.
వనదేవతలు సమ్మక్క-సారలమ్మల చిన్నజాతర నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం మహాజాతర నిర్వహించడం పరిపాటిగా మారింది.
మధ్యలో వచ్చే ఏడాదిలో మాత్రం మినీ జాతరను నిర్వహిస్తారు. ఈ మినీ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ఈ రోజు మండమెలిగే పండుగతో మినీ జాతరను ప్రారంభిస్తారు.
గురువారం మండమెలిగే పూజలు నిర్వహించగా, శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం ఉంటుంది. శనివారం చిన్నజాతర నిర్వహించనున్నారు.
Details
రూ.5.30 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
ఈ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5.30 కోట్లు కేటాయించింది.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
భద్రతను దృష్టిలో ఉంచుకుని, పోలీసులతో పాటు వివిధ శాఖల నుంచి వెయ్యి మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
మినీ జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు.
ఈ నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో మేడారం చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు భక్తులతో పోటెత్తాయి.