Sand Door Delivery: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇసుక డోర్ డెలివరీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం కోసం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా యాప్ ను రూపొందిస్తోంది.
ఈ యాప్ వచ్చే 45 రోజుల్లోపు అందుబాటులోకి రానుంది. యాప్ ప్రారంభం తర్వాత, ఇంటి అవసరాలకు సంబంధించి ఎవరైనా ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే, వారి ప్రాంతానికి నేరుగా నిర్దేశించిన ఇసుక లారీ ద్వారా డెలివరీ జరుగుతుంది.
మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ డోర్ డెలివరీ వ్యవస్థ గురించి వివరాలను వెల్లడించారు.
అవసరం ఉన్న వారు ఇతరులపై ఆధారపడకుండా నేరుగా ఇసుకను బుక్ చేసుకునేలా ఈ కొత్త యాప్ పనిచేస్తుందని చెప్పారు.
వివరాలు
అక్రమ రవాణా సమాచారం అందించేందుకు ఫోన్ నంబర్లు ఏర్పాటు
ఈ యాప్‌లో ట్రాన్స్ పోర్ట్ సర్వీస్‌ను కూడా భాగస్వాములుగా చేసేందుకు చర్యలు తీసుకుంటారని, కిలోమీటర్ వారీగా రేట్లు నిర్ణయిస్తారని తెలిపారు.
ప్రస్తుతం ఇసుకకు టన్నుకు రూ. 405 చొప్పున ఉంది.ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కలిపితే టన్నుకు రూ. 1600 లోపే ఉండాలని,అంతకంటే ఎక్కువ ధర చెల్లించడం అవసరం లేదని శ్రీధర్ సూచించారు.
అక్రమ రవాణా జరుగుతున్నట్లయితే,సమాచారం అందించేందుకు 98480 94373, 70939 14343 అనే ఫోన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఇసుక పుష్కలంగా ఉందని, కొరలేదని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది.
వివరాలు
లోడింగ్ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే
ప్రతి రోజు 75వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీస్తున్నామని, అందులో 50వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇప్పటికీ అందుబాటులో ఉందని చెప్పారు.
ఇసుక లోడింగ్ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటుందని, హైదరాబాద్‌కు ఎక్కువగా ఇసుక ఆరు జిల్లాల నుండి వస్తుందని చెప్పారు.
ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు లేవని, రాబోయే నెలన్నర రోజుల్లో అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ, జీపీఎస్, వేవ్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఓవర్ లోడ్ తో ఇసుక తరలిస్తున్నవాళ్లను బ్లాక్ లిస్ట్‌లో చేర్చడం జరుగుతుందని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ హెచ్చరించారు.