Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై నిరీక్షణ.. దానిపై స్పష్టత వచ్చాకనే
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోసం గ్రామస్థాయి నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత పరిణాల నేపథ్యంలో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు ఇంకా సమయం పట్టే అవకాశాలున్నాయి. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తాము కులగణనకు హామీ ఇచ్చామని, కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ వెళుతుందని ఆయన చెప్పారు.
అక్టోబర్ లేదా నవంబర్ లో పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ లో సర్పంచ్‌ల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ప్రస్తుతం గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్‌ల పాలన సాగుతోంది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ పదివీ కాలం ఈ ఏడాది జూలైతో ముగిసింది. దీంతో మండలాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘం అందించే ఓటర్ల జాబితా ఆధారంగా అక్టోబర్ లేదా నవంబర్‌లో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారట. ఒకవేళ పొన్నం ప్రభాకర్ చెప్పినట్లుగా కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే.. ఇంకా ఐదారు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది.