Supreme Court: రేపు సాయంత్రం 5 గంటలలోపు విధులలో చేరాల్సిందే.. వైద్యులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
కోల్‌కతా ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి నిరసిస్తూ ఆందోళనలు చేస్తోన్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వైద్యులకు విధించిన గడువు సోమవారంతో ముగియనుంది సుప్రీంకోర్టు ఈ గడువును పొడిగిస్తూ, మంగళవారం సాయంత్రం 5 గంటులలోపు విధులకు హాజరుకావాలని స్పష్టం చేసింది.. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని తెలిపారు. ఈ ఆదేశాలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చింది.
విధుల్లో చేరిన వైద్యులపై ఎటువంటి చర్యలు ఉండవు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, వైద్యుల భద్రత కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపింది. ఈ నిధులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని వివరించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం, వైద్యులు నిరంతరం విధులకు దూరంగా ఉంటే భవిష్యత్తులో చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ హాజరయ్యారు.విధుల్లో చేరిన వైద్యులపై ఎటువంటి చర్యలు ఉండవని హామీ ఇచ్చారు. ఘటన రోజు మధ్యాహ్నం 1:47 గంటలకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఆ తర్వాత 2:55 గంటలకు అసహజ మరణం కేసు నమోదు అయ్యింది.
కేసు విచారణను సెప్టెంబర్ 17కి వాయిదా
ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసం, అసహజ మరణం నివేదికపై స్పష్టత కావాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అలాగే, అప్పటి సీసీటీవీ ఫుటేజ్ సీబీఐకి ఇచ్చారా అనే ప్రశ్నను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. వైద్యుల భద్రత కోసం నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని, న్యాయమూర్తి ఆదేశించారు. పోలీసులు వైద్యుల భద్రత కోసం అవసరమైన పరిస్థితులు ఏర్పాటు చేసినట్టు నిర్ధారించాలన్నారు. కేసు విచారణను సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది. మరోవైపు, సీబీఐకి కొత్త నివేదిక సెప్టెంబర్ 17లోగా సమర్పించాల్సిన ఆదేశం ఇచ్చింది. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఫొరెన్సిక్ నివేదిక కోసం శాంపిల్స్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపాలని భావిస్తున్నట్టు తెలిపారు. తద్వారా, న్యాయస్థానం తదుపరి మంగళవారం వరకు గడువు ఇచ్చింది.