Supreme Court: ఉచితాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆలా అయితే ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరు
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించే విధానం సరైనదికాదని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే అంశంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ నిర్వహిస్తున్న న్యాయస్థానం, ఈ సందర్భంగా ఉచితాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
''ఉచిత పథకాలు మంచివి కావు. దురదృష్టవశాత్తూ, వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం లేదు.ఉచిత రేషన్,డబ్బులు అందుతుండటంతో ఎలాంటి పని చేయకుండానే ఆదాయం లభిస్తోంది.ప్రజలకు సౌకర్యాలను అందించాలనే ప్రభుత్వాల లక్ష్యం మంచిదే.కానీ,వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి.ఉచితాల వల్ల అది జరుగుతోందా? ఎన్నికల సమయంలో ఇలాంటి ఉచిత వాగ్దానాలు ప్రకటించడం సరైన విధానం కాదు,''అని జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
వివరాలు
నిరాశ్రయుల కోసం చర్యలు
పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ధర్మాసనానికి తెలిపారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఈ మిషన్ ఎంత కాలం పాటు కొనసాగుతుందో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని పేర్కొంది.