బీహార్‌లో ఘోరం.. వడ్డీ కోసం మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించిన దుండగులు
బీహార్‌లో ఘోర అమానుష ఘటన చోటు చేసుకుంది. పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ ఠాణా పరిధిలో ఓ మహిళకు మూత్రం తాగించారు. రూ.1500 అదనపు వడ్డీ చెల్లించాలంటూ తండ్రీ కొడుకులు ఓ దళిత మహిళపై దారుణానికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలిని వివస్త్రను చేసి కర్రలతో చితకబాదారు. అంతటితో ఆపకుండా బలవంతంగా ఆమెతో మూత్రం తాగించారు. బాధితురాలి భర్త, ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద రూ.9000 అప్పుగా తీసుకున్నారు. ఆ నగదు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించారు కూడా. ఈ క్రమంలోనే రూ.1500 అదనంగా వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ పలుమార్లు బాధిత కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేశాడు.
పరారీలో ప్రధాన నిందితుడు, అతని కుమారుడు సహా 4 నిందితులు
అప్పటికే భార్యభర్తలు అప్పు తిరిగి ఇచ్చేశామని చెప్పినా, అదననపు వడ్డీ కోరుతూ శనివారం ప్రమోద్ సింగ్ తన కుమారుడు అన్షు సహా మరో నలుగురు బాధిత ఇంటికి వెళ్లారు. అనంతరం ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఈ సందర్భంగా అందరూ చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేశారు. ఆపై కర్రలతో చితకబాదారు.తండ్రి ప్రమోద్ ఆదేశానుసారం కుమారుడు అన్షు బలవంతంగా ఆమెతో మూత్రాన్ని తాగించి తీవ్ర కలకలం రేపాడు. తప్పించుకున్న బాధితురాలు, పరిగెత్తుకుంటూ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలి తలకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు తక్షణమే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు ప్రమోద్ సింగ్, అతని కుమారుడు అన్షుతో పాటు మిగిలిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.