Mohali: మొహాలీలో పార్కింగ్ విషయంలో దాడి.. యువ శాస్త్రవేత్త మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో యువ శాస్త్రవేత్త అభిషేక్ స్వర్ంకర్ (39) దారుణ హత్యకు గురయ్యాడు.
ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అభిషేక్ స్వర్ంకర్ ఇటీవల స్విట్జర్లాండ్‌లో పనిచేసి ఇండియాకు తిరిగి వచ్చారు.
ప్రస్తుతం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు.
అభిషేక్ తన తల్లిదండ్రులతో కలిసి మొహాలీలోని సెక్టార్ 67లో నివాసం ఉంటున్నారు.
అతడి స్వస్థలం జార్ఖండ్‌లోని ధన్‌బాద్. అంతర్జాతీయ స్థాయిలో అభిషేక్ రచనలు ప్రచురితమయ్యాయి.
వివరాలు
కేసు నమోదు చేసిన పోలీసులు
కొద్ది నెలల క్రితమే కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు, అతని సోదరి తన కిడ్నీని దానం చేసింది.
ప్రస్తుతం అభిషేక్ డయాలసిస్ చికిత్స పొందుతున్నాడు. మంగళవారం నాడు ఇంటి ముందు పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది.
ఈ వివాదంలో పొరుగింటివాడు అభిషేక్‌ను తోసేయడంతో అతడు నేలపై పడిపోయాడు.
కుటుంబ సభ్యులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా, అప్పటికే ఆయన స్పృహ తప్పి పడిపోయారు.
వెంటనే స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు.
ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు కాగా,శాస్త్రవేత్త కుటుంబం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.