Lok Sabha polls: 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పౌరులు, ముఖ్యంగా యువకులు, మహిళా ఓటర్లు "రికార్డు సంఖ్యలో" ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. బీజేపీ సీనియర్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, రచయిత్రి, పరోపకారి సుధా మూర్తి, ఆమె భర్త ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, నటుడు ప్రకాష్ రాజ్, టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయనాడ్ నుండి రాహుల్ గాంధీ,తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్,శశి థరూర్ వంటి అనేక మంది హై-ప్రొఫైల్ అభ్యర్థులు పోటీలో ఉన్న కేరళలో రెండవ దశ రసవత్తరంగా మారింది.
కేరళ వాయనాడ్‌పైనే అందరి దృష్టి
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ 65 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 53 స్థానాల్లో గెలుపొందగా, దాని మిత్రపక్షాలు 12 గెలుచుకున్నాయి. మరోవైపు, గత సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి 89 స్థానాల్లో 23 గెలుచుకుంది. ఈ దశలో మొత్తం 1,210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో బీఎస్పీ అత్యధికంగా 74 మంది అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ 69 మంది, కాంగ్రెస్ 68 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రెండోసారి అధికారంలో ఉన్న కేరళ వాయనాడ్‌పైనే అందరి దృష్టి ఉంది. ఆయన సీపీఐకి చెందిన అన్నీ రాజా,బీజేపీ కేరళ చీఫ్ కే సురేంద్రన్‌లపై పోటీ చేస్తున్నారు.
మధుర, మీరట్‌లకు ఎన్నికలు
2019 ఎన్నికలలో, గాంధీ తన కుటుంబ కోట అయిన అమేథీ నుండి ఓడిపోయినప్పటికీ ఏడు లక్షల పైగా ఓట్లతో ఈ స్థానం నుండి గెలిచారు. కేరళలో తిరువనంతపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ల మధ్య మరో కీలక పోరు నెలకొంది. థరూర్ నాలుగోసారి సీటును నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ స్థానాలైన మధుర, మీరట్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. హేమ మాలిని మధుర నుండి హ్యాట్రిక్ సాధించాలని అనుకుంటుండగా, మీరట్ నుండి అరుణ్ గోవిల్ తన ఎన్నికల అరంగేట్రం చేయనున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కూడా ఓటింగ్ జరుగుతోంది.
భూపేష్ బఘేల్, కేసీ వేణుగోపాల్‌లకు రెండో దశ కీలకం
రాజస్థాన్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వరుసగా కోట, జోధ్‌పూర్ నియోజకవర్గాల నుండి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ కురువృద్ధులు భూపేష్ బఘేల్, కేసీ వేణుగోపాల్‌లకు రెండో దశ కీలకం. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి బఘేల్ బీజేపీ కంచుకోట అయిన రాజ్‌నంద్‌గావ్ నుంచి పోటీలో ఉన్నారు. కెసి వేణుగోపాల్ కేరళలోని అలప్పుజా నుండి పోటీ చేస్తున్నారు, 10 సంవత్సరాల తర్వాత తన పూర్వ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు . పశ్చిమ బెంగాల్‌లో హై-ప్రొఫైల్ డార్జిలింగ్ సీటు, బలూర్‌ఘాట్, రాయ్‌గంజ్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. బాలూర్‌ఘాట్ స్థానం నుంచి మళ్లీ ఎన్నికవ్వాలని భావిస్తున్న రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ భవితవ్యాన్ని ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి.