Page Loader
Telangana: శాసనసభ సమావేశాల్లోపు విత్తనచట్టం ముసాయిదా.. సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం
శాసనసభ సమావేశాల్లోపు విత్తనచట్టం ముసాయిదా.. సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం

Telangana: శాసనసభ సమావేశాల్లోపు విత్తనచట్టం ముసాయిదా.. సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాబోయే శాసనసభ సమావేశాలకు ముందు విత్తన చట్టానికి సంబంధించిన ముసాయిదాను పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విత్తన కంపెనీలను చట్ట పరంగా నియంత్రణలోకి తీసుకురావడం ద్వారా, నష్టపోయే విత్తనోత్పత్తి రైతులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వానాకాలం వ్యవసాయ సీజన్‌లో ఎరువులు,విత్తనాల సరఫరాపై బుధవారం ఆయన సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రంలోని ప్రతి మండలంలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

వివరాలు 

ఎరువుల కంపెనీల ప్రతినిధులపై అసంతృప్తి

అంతేగాక, ప్రస్తుతం అవసరమైన ఎరువులు మాత్రమే కాకుండా, వచ్చే నెల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వాటిని ముందుగానే జిల్లాల కేంద్రాల్లో నిల్వ చేయాలని సూచించారు. ఎరువుల సరఫరా విషయంలో కంపెనీలు కేటాయించిన మోతాదుకు తగ్గట్టుగా ఎరువులు అందించకపోవడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఎరువుల కంపెనీల ప్రతినిధులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల లోటుపై అధ్యయనం చేపట్టండి: పత్తి కొనుగోళ్లలో కేంద్ర విధానం పరిశీలన పత్తి కొనుగోళ్లలో మద్దతు ధర (MSP)కి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ధరల లోటు చెల్లింపు పథకం' (Price Deficiency Payment Scheme)పై సమగ్ర అధ్యయనం చేయాలని మార్కెటింగ్ శాఖ సంచాలకుడిని మంత్రి తుమ్మల ఆదేశించారు.

వివరాలు 

ఈ స్కీమ్‌ ప్రయోగాత్మకంగా అమలు చేసే జిల్లాగా ఆదిలాబాద్ 

ఈ పథకం ద్వారా రైతులకు కలిగే లాభనష్టాలను పూర్తిగా విశ్లేషించి నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు. ఈ అంశంపై బుధవారం ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాను ఈ స్కీమ్‌ ప్రయోగాత్మకంగా అమలు చేసే జిల్లాగా ఎంపిక చేసిన నేపథ్యంలో, ఈ నెల 19న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ముందే సంబంధిత నివేదికను సిద్ధం చేయాలని చెప్పారు. అదేవిధంగా, సీఎం ఆదేశాల మేరకు కొహెడలో మార్కెట్ యార్డు నిర్మాణం చేపట్టాలని, వచ్చే మామిడి సీజన్‌కు లోపు అది రైతులకు అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.