
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ ..
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
కాకాణిపై ఏ విధమైన తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
కాకాణి ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెల్లారాయి అక్రమ రవాణాకు సహకరించడంతో పాటు ఎస్సీ/ఎస్టీ కేసును కూడా కాకాణిపై నమోదు చేశారని పొదలకూరు పోలీసులు తెలిపారు.
అయితే, కాకాణి వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని అడ్వొకేట్ జనరల్ వాదించారు.
వివరాలు
కాకాణి నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయడం సముచితం కాదు
ఎస్సీ/ఎస్టీ కేసులో మొదట స్పెషల్ కోర్టును ఆశ్రయించాల్సిందే అని ఏజీ అభిప్రాయపడ్డారు.
కాకాణి నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయడం సముచితం కాదని,మొదట స్పెషల్ కోర్టు పిటిషన్‌ను రిజెక్ట్ చేస్తే లేదా రిటర్న్ చేస్తే మాత్రమే హైకోర్టును ఆశ్రయించాలన్న నిబంధన ఉందని ప్రభుత్వం వాదించింది.
ఈ విషయమై గతంలో పలు కోర్టుల తీర్పులను ఏజీ ఉదాహరించారు.అయితే,స్పెషల్ కోర్టును ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందని కాకాణి తరఫు లాయర్ వాదించారు.
సెక్షన్ 18 కింద కేసు నమోదు చేశారని, అలా అయితే సెక్షన్ 14 వర్తించదని కోర్టుకు వివరించారు.
ఈ కేసులో హైకోర్టుకు స్పెషల్ కోర్టుతో పోల్చితే పెద్ద పరిధి, అధిక అధికారాలు ఉన్నాయని కాకాణి తరఫు లాయర్ వాదన వినిపించారు.
వివరాలు
2016లో లీజు గడువు ముగిసింది
ఇక, కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు కోర్టుకు తెలియజేశారు.
పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా? అనే అంశంపై నిర్ణయం తర్వాతే మెరిట్స్‌పై విచారణ జరుగుతుందని హైకోర్టు పేర్కొంది.
కాగా, తెల్లారాయి అక్రమ మైనింగ్ ప్రభుత్వానికి చెందిన 32 ఎకరాల్లో వేరే వ్యక్తులు నిర్వహిస్తున్నారని, దానికి కాకాణికి సంబంధం లేదని లాయర్ వాదించారు.
2016లో లీజు గడువు ముగిసిందని,అప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని కోర్టుకు తెలియజేశారు.
వివరాలు
కులం పేరుతో తిట్టారన్నది కేవలం ఆరోపణ మాత్రమే
దీనిపై అప్పటి నుంచి మైనింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది.
స్థానికంగా నివసించే వారిని కులం పేరుతో తిట్టారన్నది కేవలం ఆరోపణ మాత్రమే అని కాకాణి తరఫు లాయర్ పేర్కొన్నారు.
తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తూ, ఈలోపు తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న కాకాణి లాయర్ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.