Andhra Pradesh: కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రకు భారీ వర్షాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం తీరం దాటే ప్రక్రియ బుధవారం అర్ధరాత్రి ప్రారంభమై.. గురువారం ఉదయం వరకు కొనసాగింది. తీరం దాటినప్పటికీ ఇది భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గురువారం అల్లూరి సీతారామరాజు,ఏలూరు జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురం మన్యం,విశాఖపట్నం,అనకాపల్లి, పోలవరం, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
వివరాలు
అప్రమత్తమైన ప్రభుత్వం.. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపారు.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచాయి.
దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వారికి ఆశ్రయం కల్పించారు.
వివరాలు
ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశం
వాయుగుండం ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
వర్షాలు, గాలుల కారణంగా దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు.
పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలతో పాటు పశువుల విషయంలోనూ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.
పశువులకు అవసరమైన గ్రాసం, తాగునీటిని సిద్ధంగా ఉంచాలని ప్రత్యేకంగా ఆదేశించారు.
రానున్న 48 గంటల్లో వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.