నా చిన్నతనంలో మా నాన్న లైంగికంగా వేధించాడు: డీసీడబ్ల్యూ చీఫ్ సంచలన కామెంట్స్
దిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ శనివారం తన చిన్ననాటి కష్టాలను వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. జపాన్ యువతిని హోలీ వేడుకల్లో వేధించిన వైరల్ వీడియోను మలివాల్ పరిశీలించి, దిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. అనంతరం మలివాల్ మీడియాతో మాట్లాడారు. కొంతమంది పురుషులు చేతిలో జపాన్ యువతి వేధింపులకు గురైందని ఆ వీడియోలో కనిపిస్తున్నదని మలివాల్ పేర్కొన్నారు. ఆమె సాయం కోసం అరుస్తున్నా.. ఆ వ్యక్తులు ఆగలేదని చెప్పారు. వారిని అరెస్టు చేసి జైళ్లోనే ఉంచాలని ఆదేశించారు. చిన్నతనంలో తన నాన్న నన్ను లైంగికంగా వేధించాడని, అతను కొట్టేవాడని, తాను భయపడి మంచం కింద దాక్కునేదాన్నని వాపోయారు.
ఎనిమిదేళ్ల వయసులో ఖుష్బూను కూడా వేధించిన తండ్రి
కొన్ని రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బు సుందర్ కూడా తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని సంచలన కామెంట్స్ చేశారు. ఈ సంఘటన గురించి బయటకు వచ్చి చెబుతున్నందుకు సిగ్గుపడలేదని ఆమె అన్నారు. ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఖుష్బూ చెప్పారు. మహిళలు ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడాలని ఖుష్బూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, 2015-2016 మధ్య నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలను డీసీడబ్ల్యూ చీఫ్ ఎదుర్కొంటున్నారు.