ఎన్‌సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) సంక్షోభం మొదలైన తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం శరద్ పవార్ వైపు, మరో వర్గం అజిత్ పవార్ వైపు ఉన్నాయి. ఈ ఇద్దరి నాయకుల పరస్పరం ఆరోపణలతో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇదే సమయంలో ఎన్‌సీపీ సంక్షోభం మొదలైన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకోనుంది. తొలిసారిగా శరద్ పవార్, అజిత్ పవార్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఇందుకు వేదిక కానుంది. తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లోకమాన్య తిలక్ 103వ వర్ధంతి అయిన ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నారు.
అవార్డు కార్యక్రమ ఆహ్వానితుల్లో శరద్, అజిత్
లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరద్ పవార్‌ని ఆహ్వానించామని, ఆయన మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఆహ్వానితుల్లో ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వానికి గుర్తింపుగా, పౌరులలో దేశభక్తిని పెంపొందించినందుకు గాను ఆయనకు ఈ అవార్డును అందజేస్తున్నారు. పౌరులలో దేశభక్తి భావనను మేల్కొలిపి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ప్రధాని మోదీని తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ధర్మకర్తలు ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కార్యక్రమ ఇతర ఆహ్వానితుల్లో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకానున్నారు.