LOADING...
Shashi Tharoor: ఆపరేషన్ సిందూర్ పై కొలంబియా వైఖరి పట్ల శశి థరూర్ నిరాశ 
ఆపరేషన్ సిందూర్ పై కొలంబియా వైఖరి పట్ల శశి థరూర్ నిరాశ

Shashi Tharoor: ఆపరేషన్ సిందూర్ పై కొలంబియా వైఖరి పట్ల శశి థరూర్ నిరాశ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్‌లో మరణించిన వారిపట్ల కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడం పై కాంగ్రెస్ నేత డా. శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదం పట్ల అవలంబిస్తున్న విధానాన్ని ప్రపంచ దేశాల ముందు బహిర్గతం చేయడానికి భారత పార్లమెంట్‌ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వివిధ దేశాలలో పర్యటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శశిథరూర్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

కొలంబియా తీరుపై తీవ్రంగా స్పందించిన శశిథరూర్ 

"ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరుల పట్ల కనీస సానుభూతి వ్యక్తం చేయకుండా, భారత్ తమపై నిర్వహించిన ప్రతిదాడిలో పాక్‌లో చనిపోయినవారికి మాత్రమే సంతాపం తెలిపిన కొలంబియా ప్రభుత్వ వైఖరి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. మేము ఎలాంటి దాడి చేయలేదు.. కేవలం ఆత్మరక్షణ హక్కు మేరకు చర్యలు చేపట్టాం. ఆపరేషన్ సిందూర్‌కు దారితీసిన పరిస్థితుల గురించి, మేము తీసుకున్న చర్యల కారణాలను కొలంబియా అధికారులతో సవివరంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం," అని శశిథరూర్ స్పష్టం చేశారు.

వివరాలు 

నాలుగు దశాబ్దాలుగా పలు ఉగ్రవాద చర్యలకు బలైన భారత్‌ 

"కొలంబియా దేశం కూడా గతంలో అనేక ఉగ్రదాడులను ఎదుర్కొంది. అలాగే, భారత్ కూడా గత నాలుగు దశాబ్దాలుగా పలు ఉగ్రవాద చర్యలకు బలైంది. పాకిస్థాన్ తన సైనిక వనరులను స్వీయరక్షణ కోసం కాకుండా పొరుగు దేశాలపై దాడులకు వినియోగిస్తోంది.కానీ భారత విధానాలు మాత్రం పూర్తిగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉంటాయి. మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే చేస్తున్నాం," అని వివరించారు. పహల్గాం దాడిపై స్పందించిన థరూర్,"ఆ దాడికి పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలే కారణమన్న విషయాన్ని నిరూపించగల స్పష్టమైన ఆధారాలు భారత్ వద్ద ఉన్నాయి. పాక్‌లో వినియోగంలో ఉన్న రక్షణ పరికరాలలో దాదాపు 81శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే.ఇదే విషయాన్ని మేము అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రస్తావించనున్నాం,"అని తెలిపారు.

వివరాలు 

ఆపరేషన్ సిందూర్ - ఉగ్ర స్థావరాలపై ధీటైన ప్రతిదాడి 

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు అమానుషంగా దాడి చేసి 26 మంది ప్రాణాలు హరించారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను సమూలంగా నాశనం చేసింది. ఈ ఘటనల నేపథ్యంలో పాక్ సైన్యం భారతపై ప్రతిదాడికి దిగింది. అయితే మన బలగాలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టాయి. ప్రస్తుతం భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది.