Jaishankar: పాకిస్తాన్ గడ్డ పై నుంచే ఆ దేశానికి చురకలంటించిన జైశంకర్.. మూడు చెడులను ఎదుర్కోవాలని ఎస్‌సీఓ సమ్మిట్‌లో పిలుపు..
ఈ వార్తాకథనం ఏంటి
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది.
బుధవారం ఎస్‌సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్‌కి వెళ్లారు.
పాకిస్తాన్ గడ్డపైనే, జైశంకర్ ఆ దేశానికి తీవ్రమైన సందేశం ఇచ్చారు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో జరుగుతున్న ఉగ్రవాదం, వేర్పాటువాదం కొనసాగితే, ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడవని, అభివృద్ధికి కూడా ఇది అడ్డంకిగా ఉంటుందని స్పష్టంగా తెలియజేశారు.
వివరాలు
ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడం ఎస్‌సీఓ ప్రధాన లక్ష్యం
''అభివృద్ధి, ఆర్థిక వృద్ధి అనేవి శాంతి, స్థిరత్వంపై ఆధారపడి ఉంటాయి. చార్టర్‌లో పేర్కొన్నట్లు, మూడు చెడులను ఎదుర్కోవడం అనేది చాలా అవసరం. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం కొనసాగితే, వాణిజ్యం, ఎనర్జీ సరఫరా, ప్రజల మధ్య పరస్పర మార్పిడి, కనెక్టివిటీ వంటి వాటికి ఆటంకం కలుగుతుంది'' అని జైశంకర్ స్పష్టంగా చెప్పారు.
ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడం ఎస్‌సీఓ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం గ్లోబలైజేషన్, రీబ్యాలెన్సింగ్ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌సీఓ ఆ దిశగా పనిచేయాలని సూచించారు.
ఇందుకు నిజాయితీతో కూడిన చర్చలు, పరస్పర విశ్వాసం అత్యవసరమని పేర్కొన్నారు. ఎస్‌సీఓ మూడు ప్రధాన సమస్యలను రాజీపడకుండా ఎదుర్కోవాలని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
భారతదేశం చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రస్తావించిన జైశంకర్
జైశంకర్ మాట్లాడుతూ, సహకారం, పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం ఆధారంగా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గుర్తించి, ఏకపక్ష ప్రయోజనాలకన్నా నిజమైన భాగస్వామ్యాలను నిర్మించాల్సిన అవసరాన్ని హైలెట్ చేశారు.
జైశంకర్, సమ్మిట్‌లో భారతదేశం చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలు, సుస్థిరతకు దోహదపడే జాతీయ ప్రయత్నాలను ప్రస్తావించారు.
అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తులకు ప్రతిస్పందించే మౌలిక సదుపాయాలు, యోగా, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించే మిషన్ లైఫ్ వంటి వాటిని వివరించారు.