Viral Fevers: తెలంగాణలో ఒకేరోజు ఆరుగురు మృతి.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ జ్వరాలు కారణంగా ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అటు, వైరల్ ఫీవర్స్ వల్ల ఒకే రోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామానికి చెందిన ఈడుపుగంటి సామ్రాజ్యం(67) వారం రోజుల కింద జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.
జ్వరంతో 11 ఏళ్ల బాలిక మృతి
ఇదే మండలం బ్రహ్మళకుంటకు చెందిన బానోతు కృష్ణ (50) ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో కల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండు రోజుల కింద ఇంటికి వచ్చి పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి - సదాశివనగర్ మండలంలోని భూంపల్లికి చెందిన మనస్విని(11) జ్వరం రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలను విడిచింది. కరీంనగర్ - ధర్మారం మండలానికి చెందిన నేరెళ్ల ప్రశాంత్ (26) జ్వరంతో మరణించాడు. మహబూబాబాద్ - కొత్తగూడ మండలంలోని హనుమాన్ తండాలో రాజేందర్, సంధ్య దంపతుల కుమార్తె కూడా జ్వరంతో చనిపోయిందని తల్లిదండ్రులు తెలిపారు
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
. రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలతో చికిత్స కోసం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ, విష జ్వరాల విజృంభణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ''రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోందని కానీ ఒక్క రోజులో ఐదుగురు డెంగీతో చనిపోయినట్లు వార్తలొచ్చాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవని, చాలా ఆస్పత్రుల్లో ఒక్కో బెడ్‌పై ముగ్గురు లేదా నలుగురు ఉండి చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.