
Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. 27 మంది పర్యాటకులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదలు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్ జిల్లా పరిధిలోని పహల్గాం ప్రాంతంలోని బైసరన్ వద్ద పర్యటనకు వచ్చిన విహారదారులపై ఉగ్రవాదులు దాడికి దిగారు.
'మినీ స్విట్జర్లాండ్'గా పేరొందిన ఈ ప్రాంతంలో విహరిస్తున్న పర్యాటకులపై తీవ్ర హింసాత్మకంగా దాడి చేశారు.
ఈ దాడిలో ఇప్పటివరకు 27మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.
ఈ దాడిని ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద ఘటనగా పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. బైసరన్ ప్రాంతంలో సుమారు 40 మంది పర్యటకులను, అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఉగ్రవాదులు అకస్మాత్తుగా చుట్టుముట్టారు.
.
వివరాలు
రక్షణ చర్యల్లో జాప్యం
అనంతరం విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది కాల్పులతో అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పర్యాటకుల మృతదేహాలతో ఆ ప్రాంతం రక్తసిక్తం అయ్యింది. మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. అందులో గాయపడిన వారు తమ బంధువులను రక్షించమంటూ అర్ధించారు.
ఈ ప్రాంతానికి రోడ్డు మార్గంలో రాకపోకలతో సంబంధం లేకుండా, కేవలం కాలినడకన లేదా గుర్రాల సహాయంతోనే చేరవచ్చు.
ఈ కారణంగా ఘటనా స్థలానికి వెంటనే సహాయక చర్యలు చేరడం కష్టంగా మారింది.
అయితే కాల్పుల శబ్దం విన్న వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై బైసరన్‌కు చేరుకున్నాయి.
గాయపడినవారిని హెలికాప్టర్ల సాయంతో సమీప ఆసుపత్రులకు తరలించారు.అయితే కొందరిని స్థానికులు తమ సొంతంగా గుర్రాలపై తరలించినట్లు సమాచారం అందింది.
వివరాలు
అమర్‌నాథ్ యాత్ర వేళ..
మొదట్లో మృతుల సంఖ్య తక్కువగా ప్రకటించినా, తర్వాతి సమయంలో ఇది 27కి పెరిగిందని తెలిసింది. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పహల్గాం ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. పర్యటకులు భయభ్రాంతులతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు. బైసరన్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.
జులై 3 నుంచి ప్రారంభం కానున్న 38 రోజుల అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.
ప్రతి సంవత్సరం లక్షలాది యాత్రికులు దేశమంతటినుంచి ఇక్కడకు తరలివస్తుంటారు.పహల్గాం మార్గం 48 కిలోమీటర్ల పొడవుండగా,గండేర్బల్ జిల్లా వైపు నుంచి వచ్చే మార్గం 14 కిలోమీటర్లుగా ఉంటుంది.
ఈ యాత్ర ముందు ఇలాంటి దాడులు పర్యాటకుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.