
Tax Notice: చిరు వ్యాపారుడి బిగ్ షాక్.. రూ.141 కోట్ల పన్ను నోటీసు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ చిన్న వ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు(Tax Notice)రావడం కలకలం రేపింది. బులంద్‌షహర్‌కు చెందిన సుధీర్ అనే వ్యక్తి చిన్న కిరాణా దుకాణం నడుపుతుంటే.. ఆదాయపు పన్ను శాఖ నుండి రూ.141 కోట్లకు పైగా అమ్మకాలపై నోటీసు రావడంతో షాక్‌కి గురయ్యాడు. తన పాన్‌కార్డు (PAN)ను గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి, ఢిల్లీలో ఆరు కంపెనీల పేరుతో వ్యాపారం నడుపుతున్నట్లు తేలడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం బహిరంగమైంది. సుధీర్ ప్రకారం, ఇదే తరహాలో 2022లోనూ తనకు సంబంధం లేని అమ్మకాలపై సీజీఎస్టీ(CGST)కార్యాలయం నుంచి నోటీసు అందిందని, అప్పుడే తాను ఆ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేనట్లు పన్ను అధికారులకు వివరణ ఇచ్చానని పేర్కొన్నారు.
Details
కేసు నమోదు చేసిన పోలీసులు
అయితే ఇటీవల జులై 10న మళ్లీ రూ.1,41,38,47,126 విలువైన అమ్మకాలు చేశాడని మరోసారి నోటీసు అందిందన్నారు. అందులో తన పేరు, చిరునామా, పాన్ నంబర్ మాత్రమే కాకుండా, ఢిల్లీలో ఆరు కంపెనీల యజమానిగా తనను చూపించారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక అధికారులు చెబుతున్నట్లయితే, కొందరు ఆర్థిక, సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరవడం, షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం, రుణాలు పొందడం లేదా పన్ను ఎగవేయడం కోసం ఇతరుల పాన్ వివరాలను అక్రమంగా వినియోగిస్తుంటారు.
Details
పాన్ కార్డు వివరాలు ఇతరులతో పంచుకోవద్దు
ఇలాంటి మోసాలు ఎక్కువగా పన్ను నోటీసులు వచ్చిన తర్వాత లేదా రికవరీ కాల్స్ వచ్చినప్పుడు బయటపడుతుంటాయని తెలిపారు. అందువల్ల ప్రజలు తమ పాన్‌కార్డు వివరాలను ఎప్పుడూ ఇతరులతో పంచుకోవద్దని, తమ క్రెడిట్ రిపోర్టులను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ద్వారా ఇలాంటి మోసాలను పెద్దఎత్తున అరికట్టవచ్చని తెలిపారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడికి కూడా రూ.34 కోట్లు చెల్లించాలని పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.